తెలుగు ‘బేబీ’ తక్షణ కర్తవ్యం ఏంటి?

వైష్ణవి కెరీర్ మళ్లీ ట్రాక్‌పైకి రావాలంటే.. కథకు ప్రాధాన్యతనిచ్చే సినిమాలు ఎంచుకోవడం తప్పనిసరి. బానర్స్ ను నమ్మకుండా, కథలో తానే ప్రభావం చూపగలిగే పాత్రలు ఎంపిక చేసుకుంటే, ఆమె టాలెంట్ మళ్లీ వెలుగులోకి వస్తుంది.;

By :  K R K
Update: 2025-04-13 04:33 GMT

ఐదు ఏళ్ల క్రితం ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో అల్లు అర్జున్ సోదరిగా కనిపించిన వైష్ణవి చైతన్యకు, పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రేక్షకులకు ఆమె పేరు తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ 'బేబి' సినిమా వచ్చిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, వంద కోట్ల క్లబ్‌కి చేరువయ్యింది. ఈ విజయం టాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

కేవలం కమర్షియల్ సక్సెసే కాకుండా, వైష్ణవి చైతన్య నటన కూడా ఎంతో ప్రశంస లందుకుంది. ఇద్దరు ప్రేమికుల మధ్య చిక్కుకుపోయిన అమ్మాయి పాత్రను ఆమె ఎంతో చక్కగా పోషించింది. ఆ పాత్రకు తగిన అనుభూతులు, భావోద్వేగాలు ప్రతీ సన్నివేశంలో అందించగలిగింది. అద్భుతమైన నటనతో ఆమె ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.

అయితే.. ‘బేబి’ తర్వాత వైష్ణవి చేసిన చిత్రాలు ఆ స్థాయిలో ప్రభావం చూపించ లేకపోయాయి. ‘బేబి’ విజయోత్సాహంతో దిల్ రాజు బ్యానర్‌లో 'లవ్ మీ - ఇఫ్ యూ డేర్' అనే సినిమాకు సైన్ చేసింది. అయితే, ఈ చిత్రం కథ పరంగా నిరాశపరిచింది. అందరూ దిల్ రాజు బ్రాండుపై నమ్మకంతో థియేటర్లకు వెళ్లినా, చిత్రం మాత్రం ప్రేక్షకుల మనసు గెలవలేకపోయింది.

అమ్మడి నుంచి తర్వాత వచ్చిన చిత్రం 'జాక్'. సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యస్వీసీసీ నిర్మించగా, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. ఇందులో వైష్ణవి “లేడీ డిటెక్టివ్” పాత్రలో కనిపించింది. వినడానికి కొత్తగా ఉన్నా.. ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సినిమా కూడా ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో, ఆమెపై ఉన్న అంచనాలు మరింత తగ్గిపోయాయి.

ప్రస్తుతం వైష్ణవి కెరీర్ మళ్లీ ట్రాక్‌పైకి రావాలంటే.. కథకు ప్రాధాన్యతనిచ్చే సినిమాలు ఎంచుకోవడం తప్పనిసరి. బానర్స్ ను నమ్మకుండా, కథలో తానే ప్రభావం చూపగలిగే పాత్రలు ఎంపిక చేసుకుంటే, ఆమె టాలెంట్ మళ్లీ వెలుగులోకి వస్తుంది. 'బేబి' ద్వారా కలిగిన క్రేజ్‌ను నిలబెట్టుకోవాలంటే, వైష్ణవి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News