నిర్మాతగా రీ ఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్ !
అతన్ని కేరక్టర్ నటుడిగా లేదా విలన్ పాత్రల్లో మళ్లీ స్క్రీన్‌పై చూస్తామని ఊహించారు. కానీ నవీన్ ఆ దారిని ఎంచుకోలేదు. బదులుగా.. నవీన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘వడ్డే క్రియేషన్స్’ని స్థాపించి, నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టాడు.;
వడ్డే నవీన్ ఒకప్పుడు టాలీవుడ్ లో సుపరిచితమైన పేరు. ప్రేమకథలు, హృదయాన్ని తాకే ఫ్యామిలీ డ్రామాలతో 2000వ దశకంలో తనదైన గుర్తింపు సంపాదించాడు. దాదాపు ఒక దశాబ్దం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతడు.. ఇప్పుడు ఊహించని రీతిలో సినీ రంగంలోకి తిరిగి అడుగుపెట్టాడు. చాలామంది అతన్ని కేరక్టర్ నటుడిగా లేదా విలన్ పాత్రల్లో మళ్లీ స్క్రీన్‌పై చూస్తామని ఊహించారు. కానీ నవీన్ ఆ దారిని ఎంచుకోలేదు. బదులుగా.. నవీన్ తన సొంత నిర్మాణ సంస్థ ‘వడ్డే క్రియేషన్స్’ని స్థాపించి, నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టాడు.
2000వ దశకంలో నవీన్ తన నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు. ఎమోషన్స్‌తో నిండిన.. సరళమైన కథాంశాలతో కూడిన సినిమాల్లో అతడి పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. ఆ సినిమాలు హద్దులు మీరని యాక్షన్ లేదా అతిశయోక్తులకు దూరంగా.. మనసును ఆకర్షించే కథనంతో ఆకట్టుకునేవి. కానీ, టాలీవుడ్ క్రమంగా మాస్ హీరోయిజం, యాక్షన్-ప్యాక్డ్ స్క్రిప్ట్‌ల వైపు మళ్లడంతో, నవీన్ వంటి నటులకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 2016లో ‘అటాక్’ సినిమాలో చివరిసారిగా కనిపించాడు నవీన్. ఆ తర్వాత అతడు సినిమా రంగం నుండి దాదాపుగా అదృశ్యమయ్యాడు. ఈ గ్యాప్‌లో వడ్డీ నవీన్ ఏం చేస్తున్నాడనే దానిపై పెద్దగా సమాచారం బయటకు రాలేదు. ఇది అతడి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
సాధారణంగా.. గతంలో స్టార్‌డమ్‌ని ఆస్వాదించిన నటులు .. క్యారెక్టర్ రోల్స్ లేదా విలన్ పాత్రలతో రీ-ఎంట్రీ ఇస్తారని అందరూ ఊహిస్తారు. కానీ, నవీన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. నిర్మాతగా తన కొత్త జర్నీని స్టార్ట్ చేశాడు. ‘వడ్డే క్రియేషన్స్’ బ్యానర్‌పై అతను నిర్మిస్తున్న మొదటి సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది. అయితే దాని వివరాలు పూర్తిగా బయటకు రాలేదు. అయినప్పటికీ, కొన్ని సమాచారాల ప్రకారం, ఈ సినిమా స్టార్ నటులపై ఆధారపడని, ఫార్ములా కథనాలకు దూరంగా ఉండే.. కంటెంట్-డ్రివెన్ చిత్రంగా ఉండనుంది. నవీన్ ఒకప్పుడు నటించిన సినిమాల్లాంటి సరళమైన, రిలేటబుల్ కథలకు అతను మళ్లీ జీవం పోయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకులు, కొత్త కథలకు అవకాశం ఇవ్వడం ద్వారా, అతను తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌ని సెట్ చేయాలని భావిస్తున్నాడేమో.