ఫిబ్రవరి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'తండేల్'!
ఫిబ్రవరి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'తండేల్'!సాధారణంగా ఫిబ్రవరి నెలను సినిమా పరిశ్రమలో అన్‌సీజన్‌గా భావిస్తారు. సంక్రాంతి సినిమాలు జనవరిలో హవా కొనసాగించగా, మార్చిలో పరీక్షల కారణంగా ప్రేక్షకుల రాక తగ్గుతుంది. కానీ, ఈ ట్రెండ్ మారుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డజనుకు పైగా సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకర్షించాయి.
ఫిబ్రవరి 6న అజిత్ డబ్బింగ్ చిత్రం 'పట్టుదల' విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. కంటెంట్ బలహీనంగా ఉండటంతో పాటు, ప్రమోషన్ లేకపోవడం కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా అపజయం పాలైంది. అదే సమయంలో ఫిబ్రవరి 7న నాగ చైతన్య 'తండేల్' విడుదలై, ప్రేమికుల దినోత్సవాన్ని టార్గెట్ చేయడంతో పాటు పాటలు విజయంతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పైరసీ సమస్యను ఎదుర్కొన్నప్పటికీ, ఈ సినిమా చైతన్య కెరీర్‌లో తొలి వందకోట్ల క్లబ్‌లో చేరింది.
ప్రేమికుల రోజున వచ్చిన 'లైలా' మరియు 'బ్రహ్మ ఆనందం' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. 'లైలా' సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడంతో హీరో విశ్వక్ ఓపెన్‌గా క్షమాపణలు కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ధన్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన 'రామం రాఘవం' పెద్ద వసూళ్లు సాధించలేకపోయినా, విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
ఫిబ్రవరి మూడో వారంలో వచ్చిన 'డ్రాగన్, జాబిలమ్మా నీకు అంత కోపమా' డబ్బింగ్ చిత్రాలు యూత్‌ను ఆకర్షించాయి. వీటిలో 'డ్రాగన్' మంచి వసూళ్లు సాధించింది. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన 'బాపు' సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది.
ఫిబ్రవరి చివరి వారంలో సందీప్ కిషన్ 'మజాకా' సినిమా విడుదలైంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. వీకెండ్ లో వసూళ్లు మెరుగుపడతాయని నిర్మాతలు ఆశిస్తున్నారు. చివరి చిత్రంగా విడుదలైన ఆది పినిశెట్టి 'శబ్ధం' సినిమా 'వైశాలి' తరహా విజయం సాధిస్తుందని భావించారు, కానీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.