టాలీవుడ్ లో సూర్య... బాలీవుడ్ లో జ్యోతిక
సూర్య, జ్యోతిక ఈ స్టార్ జంట వైవిధ్యమైన సినిమాలతో తమ మార్కెట్‌ని విస్తరిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.;
దాదాపు 15 సంవత్సరాల తర్వాత, తమిళ స్టార్ హీరో సూర్య ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు. అతని చివరి స్ట్రెయిట్ తెలుగు చిత్రం 2010లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్తచరిత్ర 2’ . అప్పటి నుంచి, అతడి తెలుగు సినిమా ప్రస్థానం తమిళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్‌లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో సూర్య తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్‌ని సంపాదించాడు. ముఖ్యంగా ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’, గజినీ, ఆరు, జైభీమ్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
సూర్య తమిళ సినిమాలకు మించి కొత్త ప్రయోగాలు చేయలేదు. అతని ఇటీవలి చిత్రాలు ‘రెట్రో, కంగువ’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయినప్పటికీ, తన జనాదరణను ఉపయోగించుకుంటూ, సూర్య టాలీవుడ్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వెంకీ అట్లూరితో కలిసి ఇంకా టైటిల్ నిర్ణయించని ఓ సినిమా కోసం చేతులు కలిపాడు. ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది మేలో హైదరాబాద్‌లో ఫార్మల్ పూజా కార్యక్రమంతో మొదలైంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం చందూ మొండేటితో మరో సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది.
మరోవైపు.. సూర్య భార్య, నటి జ్యోతిక హిందీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. 1998లో ‘డోలీ సజా కే రఖ్నా’ తో ఫ్లాప్ డెబ్యూ చేసిన ఆమె.. 2024లో ‘సైతాన్ శ్రీకాంత్’ చిత్రాలతో బాలీవుడ్‌లో సత్తా చాటింది. ఈ ఏడాది చివర్లో, ‘డబ్బా కార్టెల్’ తో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టింది. జ్యోతిక త్వరలో సోనాక్షి సిన్హాతో కలిసి ఒక కోర్ట్‌రూమ్ డ్రామాలో నటించనుంది. అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హార్డ్-హిట్టింగ్ లీగల్ డ్రామాలో ఇద్దరు నటీమణులు శక్తివంతమైన పాత్రల్లో కనిపించనున్నారు.
ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ, హర్మన్ బవేజా నిర్మాణంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్, బవేజా స్టూడియోస్ బ్యానర్‌లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా మొదట కరీనా కపూర్ ఖాన్, కియారా అద్వానీలతో ప్లాన్ చేశారు. కానీ టైమ్‌లైన్స్, క్రియేటివ్ డైరెక్షన్ సరిపడకపోవడంతో స్క్రిప్ట్‌ని రీవర్క్ చేసి, కొత్తగా మొదలుపెట్టారు. సూర్య, జ్యోతిక ఈ స్టార్ జంట వైవిధ్యమైన సినిమాలతో తమ మార్కెట్‌ని విస్తరిస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.