సుజీత్ ప్రాజెక్ట్ ఆలస్యం.. నాని కొత్త ప్లాన్ ఇదే!
నేచురల్ స్టార్ నాని తన సినిమాల విషయంలో ఎప్పుడూ కన్సిస్టెన్సీ, వెర్సటాలిటీని కాపాడుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ‘దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం’ వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న నాని.. ఇప్పుడు ‘హిట్-3’తో మరోసారి తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ తర్వాత 'ది ప్యారడైజ్' కూడా రెడీ అవుతుంది.
'ది ప్యారడైజ్' కంటే ముందే 'హిట్ 3' తర్వాత నాని లైన్లో పెట్టిన మరొక సినిమా ఉంది. అదే సుజీత్ దర్శకత్వంలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించాల్సిన చిత్రం. సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉండగా, ఈ సినిమా నిర్మాణంలో జాప్యం కారణంగా నాని ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు నాని-సుజీత్ చిత్రాన్ని నిర్మించాల్సిన డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.
అయితే నానితో ‘శ్యామ్ సింగ రాయ్’ వంటి హిట్ ఇచ్చిన నిర్మాత వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో నాని, నిర్మాత వెంకట్ బోయనపల్లి మధ్య మంచి సంబంధాలు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ను తన బ్యానర్‌లో తీసుకురావడానికి ఆసక్తి చూపిస్తున్నారట నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత. ఒకవేళ అదే సెట్టయితే నాని-సుజీత్ కాంబో మళ్లీ తిరిగి పట్టాలెక్కినట్టే.