పవన్ కి పోటీగా శ్రీవిష్ణు?
సమ్మర్ సీజన్‌లో భారీ చిత్రాలు విడుదలవ్వడం కొత్తేమీ కాదు. అలాగే ఓ పెద్ద సినిమా విడుదలకు సిద్ధమవుతోందంటే.. చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు ఆ డేట్‌కు దూరంగా ఉండటం సాధారణంగా కనిపించే విషయం. కానీ ఈసారి కథ మారింది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు‘ వస్తోన్న మే 9కే ఆడియన్స్ ముందుకు రాబోతుందట శ్రీవిష్ణు నటిస్తున్న ‘సింగిల్‘.
ఇప్పటికే పలుమార్లు వాయిదాపడిన ‘హరిహర వీరమల్లు‘ మే 9న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. గతంలో ఇదే డేట్ కి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్‘ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. దీంతో ‘హరిహర వీరమల్లు‘కి మే 9న బాగా కలిసొస్తుందనే మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక మే 9న ఇప్పటికే మాస్ మహారాజ్ ‘మాస్ జాతర‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సితార నుంచి వస్తోన్న సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ గురించైనా ‘మాస్ జాతర‘ ను వాయిదా వేసే అవకాశాలున్నాయి. అయితే గీతా ఆర్ట్స్ మాత్రం మే9న పోటీ విషయంలో తగ్గేదే లే అంటోందట.
శ్రీవిష్ణు నటిస్తున్న ‘సింగిల్‘ మూవీ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచే వస్తోంది. ఈ సినిమాకి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భానుప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శ్రీవిష్ణుకి జోడీగా కేతిక శర్మ, ఇవానా నటిస్తున్నారు. మొత్తంగా.. పవన్ ‘హరిహర వీరమల్లు‘తో శ్రీవిష్ణు ‘సింగిల్‘ క్లాష్ కన్ఫమా? కాదా? అనేదానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.