మార్చిలో పాత చిత్రాలకు కొత్త జోష్!
మార్చి నెలను థియేట్రికల్ రిలీజెస్ కు అంతగా అనుకూలమైన కాలంగా చూడరు. ప్రధానంగా విద్యార్థుల పరీక్షల కారణంగా కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడాన్ని తగ్గించడం వల్ల, కొత్త సినిమాల విడుదలలు ఈ నెలలో తక్కువగా ఉంటాయి. అందుకే మార్చి నెలను రీ రిలీజుల కోసం ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు మేకర్స్.
మార్చి నెలలో పలు హిట్ సినిమాలు మళ్లీ థియేటర్లలోకి రావడానికి సిద్ధమయ్యాయి. వీటిలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు‘ను ముందుగా చెప్పుకోవాలి. వెంకటేష్, మహేష్ బాబు వంటి ఇద్దరు అగ్ర కథానాయకులు నటించిన కుటుంబ కథా చిత్రమిది. ఈ సినిమాని మార్చి 7న రీ రిలీజ్ చేయబోతున్నారు.
కార్తీ నటించిన ‘యుగానికి ఒక్కడు‘ చిత్రం మార్చి 14న రీ-రిలీజ్ అవుతోంది. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ‘యుగానికి ఒక్కడు‘ సినిమా తమిళంతో పాటు తెలుగులో అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు నాగ్ అశ్విన్ తొలి చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘ కూడా రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. నాని-విజయ్ దేవరకొండ నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం‘ మార్చి 21న మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది.
మార్చి మూడో వారంలో అలరించడానికి రాబోతుంది రెబెల్ స్టార్ ప్రభాస్ సూపర్ హిట్ మూవీ ‘సలార్‘. ఈ చిత్రాన్ని మార్చి 21న మళ్లీ థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. మొత్తంగా.. మార్చి నెలను కొత్త సినిమాలకు కాకుండా, రీ-రిలీజ్‌ల కోసం పూర్తిగా వినియోగించుకోవాలనే వ్యూహాన్ని ఫిల్మ్ మేకర్స్ అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది