‘శంకర్ వరప్రసాద్’ గా మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి ఉత్సాహాన్ని అందించేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు. తన తదుపరి చిత్రానికి సంబంధించి చిరంజీవికి స్క్రిప్ట్ వినిపించడం పూర్తయిందని, కథలో ఆయన పాత్ర ‘శంకర్ వరప్రసాద్’ అని ఆయన స్వయంగా వెల్లడించాడు. ఈ పేరు వినగానే అభిమానుల్లో ఉత్సుకత పెరిగింది.
చిరంజీవి అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్’ అయినప్పటికీ, ఆయన సినిమాల్లో ‘శంకర్’ అనే పేరు కలిగిన పాత్రలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుగా రూపొందనుంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.
ఇందులో ఇద్దరు కథానాయికల పాత్రలు ఉంటాయని, ఒక పాత్ర కోసం అదితి రావు హైదరి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. భీమ్స్ సంగీతం అందించనున్నాడు. షైన్ స్క్రీన్స్ పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.