‘ఎల్లమ్మ’ విషయంలో దిల్ రాజు కన్ఫ్యూజన్ !
వేణు యెల్దండి కథ చెప్పే తీరుపై, ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉన్నప్పటికీ, నితిన్ ప్రస్తుత మార్కెట్ స్థితి బడ్జెట్‌ని తిరిగి పరిశీలించేలా చేస్తోంది.;
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాతగా రాజ్యమేలిన దిల్ రాజు, ఇప్పుడు మాత్రం ఒక మంచి హిట్ కొట్టడానికి కూడా కష్టపడుతున్నాడు. గత కొన్ని సంవత్సరాల్లో అతని ఖాతాలో గుర్తించదగ్గ హిట్ ఒక్క వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” మాత్రమే. ప్రస్తుతం అతను మిడ్-రేంజ్ స్టార్లతో పలు ప్రాజెక్టులు చేస్తున్నాడు. కానీ చాలా వాటికి బడ్జెట్ సమస్యలు ఎదురవుతున్నాయి.
అలాంటి ఒక ప్రాజెక్ట్ “ఎల్లమ్మ”. ఇది “బలగం” సినిమాతో ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ వేణు యెల్దండి తదుపరి చిత్రం. మొదట్లో ఈ సినిమాకి నాని హీరోగా సైన్ చేశాడు. కానీ ఏ కారణాలవల్లనో అతను తప్పుకున్నాడు. ఆ తర్వాత నితిన్ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాడు. కానీ అతని ఇటీవలి వరుస ఫ్లాపుల వల్ల అతని థియేట్రికల్, నాన్-థియేట్రికల్ మార్కెట్ విలువ గణనీయంగా తగ్గిపోయింది. దీంతో దిల్ రాజు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఇరకాటంలో పడ్డాడు.
వేణు యెల్దండి కథ చెప్పే తీరుపై, ప్రాజెక్ట్ మీద నమ్మకం ఉన్నప్పటికీ, నితిన్ ప్రస్తుత మార్కెట్ స్థితి బడ్జెట్‌ని తిరిగి పరిశీలించేలా చేస్తోంది. మరోవైపు, దిల్ రాజు అల్లు అర్జున్, ప్రభాస్‌లతో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ వారి బిజీ షెడ్యూల్స్ కారణంగా అటువంటి ప్రాజెక్టులు రెండేళ్ల తర్వాతే సాధ్యపడేలా ఉన్నాయి. మరి ‘ఎల్లమ్మ’ నితిన్ తోనే తెరకెక్కుతుందో లేక వేరే హీరోతో రూపొందుతుందో చూడాలి.