ఆ ముగ్గురు లెజెండ్సే నాకు ప్రేరణ : మెగాస్టార్ చిరంజీవి

ప్రముఖుల ప్యానెల్ చర్చలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్, హేమ మాలిని, మోహన్‌లాల్, మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ చర్చను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నడిపించారు.;

By :  K R K
Update: 2025-05-02 00:42 GMT

ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ప్రారంభోత్సవం తాజాగా ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన ప్రముఖుల ప్యానెల్ చర్చలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్, హేమ మాలిని, మోహన్‌లాల్, మిథున్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ చర్చను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నడిపించారు.

ప్యానెల్ చర్చలో చిరంజీవి తన సినీ జీవితం ప్రారంభ దశను గుర్తుచేసుకున్నారు. “నేను సినీ రంగంలోకి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పటికే ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు లాంటి దిగ్గజాలు ఉన్నారు. నేను ఏ ప్రత్యేకత తీసుకురాగలనో ఆలోచించేవాణ్ని,” అని చిరంజీవి తెలిపారు.

“1977లో నటన నేర్చుకుంటున్న సమయంలో మిథున్ చక్రవర్తి నటించిన ‘మృగయా’ చిత్రాన్ని చూశాను. ఆయన నటన అంత రా గా, అంత సహజంగా ఉండేది. అదే నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నిజాయితీగా, హృదయానికి దగ్గరగా ఉండాలని నన్ను ప్రేరేపించింది. యాక్షన్ విషయంలో ‘షోలే’ సినిమాను, అమితాబ్ బచ్చన్ జీ చేసిన సాహస ఘట్టాలను చూసి నేను కూడా స్టంట్స్ బాగా చేయాలనే తపన కలిగింది. డ్యాన్స్ విషయంలో అయితే కమల్ హాసన్ గారే నాకు అద్భుతమైన ప్రేరణ. ఆయన స్టెప్పులను గమనించటం, అధ్యయనం చేయటం నా అలవాటయ్యింది. ఈ ముగ్గురు లెజెండ్స్‌ని నిశితంగా గమనిస్తూ, నా స్వంత శైలి ఏర్పరచుకునేందుకు ప్రయత్నించాను,” అని చిరంజీవి అన్నారు.

ఈ శుభవేళ ఈ తారలంతా ఒకే వేదికపై కలుసుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇండియన్ సినిమా ప్రపంచంలో ఈ విధమైన చర్చలు, అనుభవాల పంచుకోవడం, తద్వారా భవిష్యత్ పుత్తడపు తెరకు మరింత వెలుగు తీసుకురావడమే ఈ వేవ్స్ సమ్మిట్ లక్ష్యం.

Tags:    

Similar News