2026 సంక్రాంతి కర్చీఫ్ ఫైట్ మొదలైంది!

Update: 2025-03-07 03:36 GMT

టాలీవుడ్‌కి సంక్రాంతి సీజన్ ఎప్పుడూ ప్రత్యేకమే. సంక్రాంతి సమయంలో తమ సినిమాలను విడుదల చేస్తే హిట్ ఖాయమనే నమ్మకం హీరోలతో పాటు దర్శకనిర్మాత లలోనూ ఉంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా పండగ మూడ్‌లో ప్రేక్షకుల ఆదరణ లభించడంతో నిర్మాతలు ఈ సీజన్‌ను ఎప్పుడూ మిస్ అవ్వడానికి ఇష్టపడరు. అందుకే 2026 సంక్రాంతి కోసం ఇప్పటినుండే రష్ పెరుగుతుంది.

వచ్చే సంక్రాంతి రేసులోకి వచ్చే సినిమాల జాబితా రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న 'డ్రాగన్' చిత్రం ముందుగా సంక్రాంతి రేస్‌లో బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. జనవరి 10, 2026న ఈ సినిమాకోసం విడుదల తేదీని ప్రకటించారు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రాన్ని వరుస షెడ్యూల్స్ లో కంప్లీట్ చేయడానికి పక్కా ప్లానింగ్ సిద్ధం చేశాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. నవంబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందనే కాన్ఫిడెన్స్‌లో ఉంది టీమ్.

సంక్రాంతి బరిలో తన సినిమా పక్కాగా ఉండాలని చూసుకునే దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతి బరిలో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. వచ్చే సంక్రాంతికి చిరంజీవితో సినిమాని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే చిరు సినిమాకి సంబంధించి అనిల్ రావిపూడి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాడు.

విక్టరీ వెంకటేష్ మరోసారి సంక్రాంతి బరిలో దిగబోతున్నాడట. 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత ఇంకా తన తర్వాతి సినిమాని ప్రకటించలేదు. అయితే స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో వెంకీ సినిమా పక్కా అనే సంకేతాలు అందుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి ఈ వారంలోనే అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయట.

మాస్ మహారాజ రవితేజ-కిషోర్ తిరుమల కాంబోలో ఒక సినిమా సెట్ అయ్యిందనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది. ఓకే అయితే వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లాలని యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొస్తారనే ఆలోచన జరుగుతుందట.

నవీన్ పోలిశెట్టి-మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న 'అనగనగా ఒక రాజు' కూడా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేసిందనే ప్రచారం ఉంది. మొత్తంగా.. ఇప్పటికే అరడజను సినిమాలు సంక్రాంతి స్లాట్‌పై కన్నేశాయి. మరి.. వీటిలో ఏ ఏ చిత్రాలు సంక్రాంతి బరిలో రానున్నాయో రానున్న రోజుల్లో తేలనుంది.

Tags:    

Similar News