గంజాయి కేసులో మలయాళ దర్శకులు

సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు, ప్రత్యేక బృందం రాత్రి 2 గంటల సమయంలో దాడి నిర్వహించింది.;

By :  K R K
Update: 2025-04-28 09:47 GMT

ప్రముఖ మళయాళ డైరెక్టర్స్ ఖలీద్ రహ్మాన్, అశ్రఫ్ హంసా సహా ముగ్గురు హైబ్రిడ్ గంజాయితో పట్టుబడి తాజాగా అరెస్టయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారి నుండి 1.63 గ్రాముల హైబ్రిడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్టేషన్ బెయిల్‌పై వారిని విడుదల చేశారు. ఈ పరిణామం నేపథ్యంలో, ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్, ఈ ఇద్దరు దర్శకులను తమ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది.

యూనియన్ అధ్యక్షుడు రెంజి పనిక్కర్, ప్రధాన కార్యదర్శి జి.ఎస్. విజయన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రస్తుతం జరుగుతున్న విచారణ పురోగతిని పరిశీలించిన తర్వాత మరింత చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎక్సైజ్ శాఖ వర్గాల ప్రకారం, సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చిన సమాచారం మేరకు, ప్రత్యేక బృందం రాత్రి 2 గంటల సమయంలో దాడి నిర్వహించింది. ఖలీద్ రహ్మాన్, అశ్రఫ్ హంసా తో పాటు, వారి మిత్రుడు షలీఫ్ మహ్మద్ కూడా అరెస్టయ్యారు.

ఖలీద్ రహ్మాన్ "అనురాగ కరిక్కిన్వేళం", "ఉండ" వంటి హిట్ చిత్రాలకు దర్శకుడు కాగా, అశ్రఫ్ హంసా ‘భీమండే వళి’ వంటి సినిమాలను తెరకెక్కించారు. రహ్మాన్ తాజా చిత్రం "ఆలప్పుళజింఖానా" ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తెలుగులో ఈ సినిమాను జింఖానా గా విడుదల చేశారు.

Tags:    

Similar News