తొలిసారి మెగాఫోన్ పట్టనున్న ఉన్ని ముకుందన్
ఈ ప్రాజెక్టును శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ బ్యానర్ నిర్మించిన చిత్రాల్లో అత్యంత ఖరీదైన, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం నిలవనుందనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది.;
మలయాళ సినీ నటుడు ఉన్ని ముకుందన్ త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడు. తొలిసారిగా కెమెరా వెనుకకి అడుగుపెడుతున్న ఉన్ని, ఓ సూపర్ హీరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి కథను అందిస్తున్నది మిధున్ మాన్యువల్ థామస్.. ‘అంజామ్ పాదిరా, అబ్రహాం ఓజ్లర్, ఆడు’ వంటి హిట్ చిత్రాలతో ప్రజాదరణ పొందిన దర్శకుడు.
ఈ ప్రాజెక్టును శ్రీ గోకులం మూవీస్ పతాకంపై గోకులం గోపాలన్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ బ్యానర్ నిర్మించిన చిత్రాల్లో అత్యంత ఖరీదైన, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం నిలవనుందనే టాక్ ఇప్పటికే వినిపిస్తోంది. ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ వార్తను వెల్లడిస్తూ ఉన్ని తన మనసును తడిగా మలచిన ఎమోషనల్ స్టేట్మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.
"నాకు చిన్నప్పటి నుంచే సూపర్ హీరోలంటే అమితమైన ఇష్టం. చాలా మంది వీళ్లను కల్పితమేనని చెప్పినా, నాకు వాళ్ళ కథల్లో ఆశ కనిపించేది, ఓ గుర్తింపు కనిపించేది. పుస్తకాలలో, సినిమాలలో, జానపదాల్లో, చిన్నచిన్న యాక్షన్ ఫిగర్‌లలో కూడా నాకు నా హీరోలు కనిపించేవారు. ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు కానీ తన కలలను వదల్లేదు. ఈ రోజు అతను మౌనంగా, గర్వంగా ఒక అడుగు ముందు కేస్తున్నాడు. అతను ఎన్నేళ్లుగా తన హృదయంలో దాచుకున్న కథను చెప్పబోతున్నాడు.
ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో, పలు భాషల్లో విడుదల కానుంది. ప్రాంతీయ కథనాలతో కూడిన సూపర్ హీరో సినిమాలకి ఇది ఒక కొత్త దారిని తీసుకువెళ్లే ప్రయత్నమవుతోంది. ప్రస్తుతం ఉన్ని ఒక తెలుగు చిత్ర షూటింగ్‌లో ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే ఆయన తన దర్శకత్వ కలపై పూర్తి దృష్టి పెట్టనున్నాడు. అదే సమయంలో దర్శకుడు మిధున్ కూడా ‘ఆడు 3’ కోసం స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు.