ఓటీటీలో సందడి చేస్తున్న మరో సూపర్ హిట్ మలయాళ చిత్రం
గతేడాది డిసెంబరు 19న క్రిస్మస్ కానుకగా విడుదలైన మలయాళ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ 'రైఫిల్ క్లబ్';
ఇటీవల మలయాళం సినిమా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలతో థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ విశేష ఆదరణ పొందుతోంది. గతేడాది డిసెంబరు 19న క్రిస్మస్ కానుకగా విడుదలైన మలయాళ బ్లాక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ 'రైఫిల్ క్లబ్' అందుకు తాజా ఉదాహరణ. లో-బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
'రైఫిల్ క్లబ్' సినిమాలో విజయ రాఘవన్, దిలీశ్ పోతన్, 'హృదయం' ఫేమ్ దర్శనా రాజేంద్రన్, ఉన్నిమయ ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. 90ల టాలీవుడ్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ఒక కీలక పాత్రలో నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంతో మలయాళంలో నటనారంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రానికి ఆశిక్ అబు దర్శకత్వం వహించారు.
మంగళూరులో అండర్ వరల్డ్ డాన్ దయానంద్ బారే (అనురాగ్ కశ్యప్) కొడుకును ఓ జంట అనుకోకుండా హత్య చేస్తుంది. భయంతో కేరళలోని వయనాడ్ కొండల్లో ఉన్న రిమోట్ రైఫిల్ క్లబ్‌లో ఆశ్రయం పొందుతుంది. గన్ ఫైరింగ్‌లో నిపుణులైన ముగ్గురు వ్యక్తులు ఈ క్లబ్‌ను నిర్వహిస్తుండగా, సినిమా హీరో షాజహాన్ వేట నేర్చుకునేందుకు అక్కడ చేరతాడు. అయితే, ఈ జంట అక్కడున్న విషయం తెలుసుకున్న దయానంద్ తన గ్యాంగ్‌తో కేరళ వెళతాడు. క్లబ్ సభ్యులు తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు, దయానంద్ గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నారు, చివరికి ఏమైందనేది ఈ చిత్ర ప్రధాన ఆకర్షణ.
డార్క్ కామెడీ, వెస్ట్రన్ స్టైల్ బ్యాక్ డ్రాప్, గన్ ఫైరింగ్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రత్యేకతగా నిలిచాయి. పాత్రల పరిచయాలు కాస్త సమయం తీసుకున్నా, కథ ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. నైట్ ఎఫెక్ట్స్, రైఫిల్ ఫైట్ సీన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణలు.
హాలీవుడ్ తరహా వెస్ట్రన్ స్టైల్ సినిమాలు భారతీయ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పరిస్థితిలో 'రైఫిల్ క్లబ్' కొత్త అనుభూతిని అందిస్తోంది. ఈ తరహా కథలు తెలుగులో నిర్మిస్తే ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో తెలియదు కానీ, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీల్లో మంచి ప్రేక్షకాదరణ పొందుతుండటం విశేషం.