50 కోట్ల క్లబ్ లోకి చేరిన మలయాళ థ్రిల్లర్ మూవీ !
2025లో మొదటి 50 కోట్ల వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది.;
మాలీవుడ్ యూత్ స్టార్ ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ థ్రిల్లర్ మూవీ "రేఖాచిత్రం". ఇది 2025లో మొదటి 50 కోట్ల వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది. ఈ విజయాన్ని ఆసిఫ్ అలీ తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. "ది ప్రీస్ట్" తర్వాత జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి, జాన్ మంత్రికల్ కథను రాశారు.
సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఈ చిత్రం, విడుదలైన మొదటి వారంలోనే నాలుగింతల వసూళ్లు సాధించింది. విడుదలైన మొదటి రోజు నుండే ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆధునిక చరిత్ర నేపథ్యానికి మిస్టరీ క్రైమ్ డ్రామా జానర్ కలగలిపిన ఈ చిత్రం మలయాళ సినిమాకు కొత్త అనుభవాన్ని అందించింది.
జనవరి 9న విడుదలైన "రేఖాచిత్రం".. ప్రారంభ వారంలో కేరళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. బుధవారం లాంటి సాధారణ రోజులో కూడా ఒక కోటి రూపాయల వసూళ్లు సాధించి.. ఆసిఫ్ అలీ కెరీర్‌లో అత్యుత్తమ బాక్సాఫీస్ ఓపెనింగ్ ను నమోదు చేసింది.
ఈ చిత్రంలో అనశ్వర రాజన్, మనోజ్ కె జయన్, సిద్ధిఖ్, నిషాంత్ సాగర్, సైదికుమార్, భామ అరుణ్ వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. కావ్య ఫిలిమ్ కంపెనీ అండ్ యాన్ మెగా మీడియా బ్యానర్లలో వేణు కన్నప్పిల్లి నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది.