మళ్ళీ పోలీసాఫీసర్ గా మోహన్ లాల్ !
పోస్టర్‌లో బాత్రూమ్‌లో వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్‌ను బట్టి, మోహన్‌లాల్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తు్న్నట్టు అర్ధమవుతోంది.;
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ నెక్స్ట్ మూవీ.. టెంటేటివ్‌గా యల్365 అని పిలుస్తున్న చిత్రాన్ని కొత్త దర్శకుడు ఆస్టిన్ డాన్ థామస్ రూపొందిస్తున్నారు. ఇది మోహన్ లాల్ కెరీర్ లో 365వ చిత్రం. ఈ సినిమాకు రితీష్ రవి రచయితగా, అషీక్ ఉస్మాన్ నిర్మాతగా అషీక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో బాత్రూమ్ సీన్ కనిపిస్తుంది. అక్కడ మిర్రర్‌పై యల్ 365 అని మెన్షన్ చేయగా.. దర్శకుడు, రచయిత, నిర్మాత పేర్లు రాసి ఉన్నాయి. పోస్టర్‌లో బాత్రూమ్‌లో వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్‌ను బట్టి, మోహన్‌లాల్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తు్న్నట్టు అర్ధమవుతోంది.
‘‘చాలా సంతోషంతో నా తదుపరి సినిమాను ప్రకటిస్తున్నాను. ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం, రితీష్ రవి రచన, అషీక్ ఉస్మాన్ నిర్మాణంలో అషీక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది," అని మోహన్‌లాల్ తన సోషల్ మీడియాలో రాశారు. ఈ డ్రామాకు సంబంధించిన తదుపరి వివరాలు, తారాగణం, టెక్నికల్ టీమ్ గురించి ఇంకా రహస్యంగా ఉంచారు. అయితే.. యువ దర్శకుడితో మోహన్‌లాల్ సినిమా చేయడం పట్ల అభిమానులు సంతోషంగా ఉన్నారు.
ఇంతకుముందు మోహన్‌లాల్ నటించిన 'తుడరుం' సినిమాను తరుణ్ మూర్తి రూపొందించారు. అతను కూడా ఆ సినిమాకు ముందు కేవలం రెండు సినిమాలు చేసిన దర్శకుడే. 'తుడరుం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో పాటు, మోహన్‌లాల్ రాబోయే ఫ్యామిలీ డ్రామా 'హృదయపూర్వం'లో కూడా హీరోగా కనిపించనున్నారు. సత్యన్ అంతికాడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోహన్ లాల్ ఆఖరుగా పోలీస్ గా నటించిన చిత్రం ‘12th మేన్’. అది మంచి సక్సెస్ సాధించింది. మరి ఈ సినిమాకి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.