మోహన్ లాల్ ‘ఎంపురాన్’ చిత్రంలో హాలీవుడ్ స్టార్ !
కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన "L2: ఎంపురాన్" సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ ను వదులుతున్నారు. సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ కు సీక్వెల్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరింత భారీ బడ్జెట్‌తో, వైడ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు పెరుగుతున్నాయి.
చిత్ర బృందం తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం.. హాలీవుడ్ నటుడు జెరోమ్ ఫ్లిన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. "గేమ్ ఆఫ్ థ్రోన్స్" వెబ్ సిరీస్‌తో ప్రఖ్యాతి పొందిన జెరోమ్, ఈ సినిమాలో బోరిస్ ఒలివర్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన "జాన్ విక్ చాప్టర్ 3," "సోల్జర్ సోల్జర్," "బ్లాక్ మిర్రర్" వంటి చిత్రాలలో కూడా నటించారు.
తాజాగా విడుదలైన టీజర్‌లో జెరోమ్ ఫ్లిన్ తన పాత్రను పరిచయం చేసుకున్నారు. భారతీయ సినిమాలో భాగమవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ చిత్రం తనకు ప్రత్యేకమైనదని తెలిపారు. ఈ చిత్రంలో ఇంద్రజిత్ సుకుమారన్, టొవినో థామస్, మంజు వారియర్, సనియా అయ్యప్పన్, సాయి కుమార్, బైజు సంతోష్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుబాస్కరన్, ఆషీర్వాద్ సినిమాస్ అధినేత ఆంటోనీ పెరుంబవూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.