‘హృదయపూర్వం’ షూటింగ్ తో మోహన్ లాల్ బిజీ బిజీ !
‘హృదయపూర్వం’ ఒక కుటుంబ కథాచిత్రంగా రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్ సందీప్ బాలకృష్ణన్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవికా మోహనన్ నటిస్తోంది.;
మాలీవుడ్ దిగ్గజం మోహన్‌లాల్ రీసెంట్ గా ‘తుడరుమ్’ మూవీతో సూపర్ హిట్ సాధించి, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ ‘హృదయపూర్వం’ షూటింగ్‌లో నిమగ్న మయ్యారు. ప్రముఖ దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ రూపొందిస్తున్న ఈ చిత్రం... మోహన్‌లాల్, సత్యన్‌ల కాంబినేషన్ కు మరో అధ్యాయంగా నిలుస్తుంది. వీరిద్దరి కలయికలో గతంలో ‘నడోడిక్కాట్టు, వరవేల్పు, పట్టణప్రవేశం’ వంటి ఎన్నో ఐకానిక్ చిత్రాలు రూపొందాయి, ఇవి నేటికీ ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానం సంపాదించాయి.
‘హృదయపూర్వం’ ఒక కుటుంబ కథాచిత్రంగా రూపొందుతోంది. ఇందులో మోహన్‌లాల్ సందీప్ బాలకృష్ణన్ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మాళవికా మోహనన్ నటిస్తోంది. ఆమె ‘తంగలాన్, మాస్టర్’ వంటి చిత్రాలతో మాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు పొందిన నటి. ఈ చిత్రం మోహన్‌లాల్ అండ్ సత్యన్ అంతిక్కాడ్‌ల గత సినిమా ‘ఎన్నుం ఎప్పోళుం’ తర్వాత వారి మధ్య 10 సంవత్సరాల విరామానికి తెరదించుతుంది. ఫిబ్రవరి 10, 2025న కొచ్చిలో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభమైంది, మోహన్‌లాల్ ఫిబ్రవరి 14న సెట్స్‌లో చేరారు.
‘హృదయపూర్వం’ చిత్రం ఒక భావోద్వేగ కథాంశంతో, ఒక హాస్య కోణంలో కుటుంబ బంధాలను ఆకట్టుకునే విధంగా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్ర కథను సత్యన్ అంతిక్కాడ్ కుమారుడు అఖిల్ సత్యన్ రాయగా, స్క్రీన్‌ప్లే , డైలాగ్‌లను నూతన రచయిత సోను టి.పి. అందించారు. సినిమాలో మాళవికా మోహనన్‌తో పాటు సంగీత మాధవన్ నాయర్, సిద్దిఖ్, సంగీత్ ప్రతాప్, లాలు అలెక్స్, జనార్దనన్, ఎస్.పి. చరణ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం, ఆగస్టు 28, 2025న థియేటర్లలో విడుదల కానుంది.