మమ్ముట్టి ఏఐ రూపంలో మెరిసిన ‘రేఖాచిత్రం’
అసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘రేఖాచిత్రం’ మార్చి 6న సోనీ లివ్‌లో ప్రీమియర్ అయ్యింది. ఆశ్చర్యకరంగా, ఇది అనుకున్న తేదీ కంటే ఒక రోజు ముందుగానే విడుదలైంది. కథ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో నడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. అందరి దృష్టిని ప్రధానంగా తనవైపుకు తిప్పుకున్నది మమ్ముట్టి ఏఐ రూపం. ఈ చిత్ర కథ 1985లో విడుదలైన ‘కాతోరు కాతోరం’ సినిమా చుట్టూ తిరుగుతుంది. ఆ కాలానికి సంబంధించిన నిజమైన అనుభూతిని కల్పించేందుకు మేకర్స్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మమ్ముట్టి యువరూపాన్ని అత్యద్భుతంగా మళ్లీ సృష్టించారు.
ఇది చూసిన నెటిజన్లు మంత్రముగ్ధులయ్యారు. ‘రేఖాచిత్రం’ టీమ్ చేసిన అద్భుతమైన సాంకేతిక కృషిని ప్రశంసిస్తూ, కొంతమంది సినిమాకు పెద్ద బడ్జెట్ కంటే, వెనుక ఉన్న ఉద్దేశమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. పరిమితమైన బడ్జెట్‌తోనే అత్యున్నత ఏఐ పనితనాన్ని అందించడాన్ని గొప్ప ప్రదర్శనగా అభివర్ణించారు. మరోవైపు, కొందరు పెద్ద దర్శకులు భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ ఏఐ టెక్నాలజీని సరిగ్గా ఉపయోగించలేకపోయారని, కొంతమంది పాత నటుల రూపాలను తెరపై నిరాశపరిచేలా రూపొందించారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అలాంటి సందర్భాల్లో ‘రేఖాచిత్రం’ టీమ్ పనితనం నిజంగా అభినందనీయమని ప్రశంసలు కురిపించారు.
సినిమా కథ విషయానికి వస్తే, ఇది 40 ఏళ్ల నాటి హత్యకేసును ఛేదించే పోలీస్ ఆఫీసర్ కథగా నడుస్తుంది. ఈ మిస్టరీ-థ్రిల్లర్‌ను చక్కగా మలచిన దర్శకుడిని ప్రశంసిస్తూ, మమ్ముట్టి ఏఐ రూపాన్ని అత్యంత సహజంగా తీర్చిదిద్దిన తీరును నెటిజన్లు ప్రత్యేకంగా ప్రశంసించారు.