మరో మల్లూ నటుడిపై డ్రగ్స్ ఆరోపణ !
తాజాగా, మలయాళ నిర్మాత హసీబ్ మలబార్.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో నటించిన శ్రీనాథ్ బాసి సెట్‌లో డ్రగ్స్ డిమాండ్ చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు.;
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ వాడకం వివాదంలో చిక్కుకోవడంతో, ఇలాంటి మరిన్ని సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, మలయాళ నిర్మాత హసీబ్ మలబార్.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో నటించిన శ్రీనాథ్ బాసి సెట్‌లో డ్రగ్స్ డిమాండ్ చేశాడని సంచలన ఆరోపణలు చేశాడు.
‘నముక్కు కోడదియిల్ కాణామ్’ సినిమాను నిర్మించిన హసీబ్ అందులో నటించిన శ్రీనాథ్ ప్రవర్తన గురించి.. ఓ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్టు వివరించాడు. ఈ నటుడి సెట్ వెనుక ప్రవర్తన గురించి తీవ్రమైన విమర్శలు చేశాడు. శ్రీనాథ్ ప్రవర్తన వల్ల షూటింగ్‌లో పెద్ద ఎత్తున అంతరాయాలు ఏర్పడ్డాయని ఆయన చెప్పాడు.
హసీబ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీనాథ్‌కు గంజాయి ఇవ్వకపోతే సెట్‌లో సహకరించేవాడు కాదు. ఒకసారి రాత్రి 3 గంటలకు శ్రీనాథ్ బృందం నుంచి హసీబ్‌కు ఫోన్ వచ్చిందట. నటుడు డ్రగ్స్ డిమాండ్ చేస్తున్నాడని.. లేకపోతే షూటింగ్‌లో పాల్గొనడని చెప్పారు. అంతేకాదు, శ్రీనాథ్ గంజాయిని సెట్‌కు తీసుకొచ్చి.. తన కారవాన్‌లో దాచుకుని, సీన్‌ల మధ్యలో వాడేవాడని హసీబ్ ఆరోపించాడు.
ఆ కారవాన్‌లోకి ఎవరినీ అనుమతించేవాడు కాదని కూడా చెప్పాడు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని హసీబ్ అనుకున్నాడు. కానీ అలా చేస్తే సినిమా నిర్మాణం ఆగిపోతుందనే భయంతో ఆగిపోయాడు. ఇలాంటి సమస్యలను ఇతర నిర్మాతలు కూడా ఎదుర్కొన్నారని, కానీ వారికి ముందే దీని గురించి తెలియదని హసీబ్ వెల్లడించాడు.