బెయిల్ పై విడుదలైన ‘దసరా’ విలన్
బుధవారం రాత్రి.. కోచీలోని ఓ ప్రముఖ హోటల్‌పై పోలీసులు సడెన్‌గా దాడి నిర్వహించారు. ఈ సమయంలో షైన్ టామ్ చాకో హోటల్ నుంచి పరుగు తీశాడు. అతడు పరుగుపెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.;
మలయాళంతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులకూ సుపరిచితమైన నటుడు షైన్ టామ్ చాకో. తాజాగా అతడు డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శనివారం నాడు కొచ్చి పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి.. అదే సాయంత్రం బెయిలుపై విడుదల చేశారు. ఈ ఘటన మలయాళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. బుధవారం రాత్రి.. కోచీలోని ఓ ప్రముఖ హోటల్‌పై పోలీసులు సడెన్‌గా దాడి నిర్వహించారు. ఈ సమయంలో షైన్ టామ్ చాకో హోటల్ నుంచి పరుగు తీశాడు. అతడు పరుగుపెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి.. శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
"నేను ఎలాంటి మాదక ద్రవ్యాలు తీసుకోలేదు. హోటల్‌లో దాడి జరుగు తుండటంతో భయంతో అక్కడి నుంచి పరుగెత్తాను. నా ప్రాణాలకు ప్రమాదం అని అనిపించింది," అని తెలిపాడు. అంతేకాక, డ్రగ్ డీలర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని అతడు ఖండించాడు. ఇదిలా ఉండగా.. మరోపక్క మలయాళ నటి విన్సీ ఆలోషియస్, ఓ మలయాళ సినిమా షూటింగ్ సమయంలో షైన్ టామ్ చాకో తనపై అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ విషయమై కూడా పరిశ్రమలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు షైన్ టామ్ చాకో “దసరా”, “దేవర” వంటి హిట్ చిత్రాల ద్వారా పరిచయం అయ్యాడు. అలాగే 2024 లో విడుదలైన “డాకూ మహారాజ్”, “రాబిన్ హుడ్” వంటి చిత్రాల్లో కూడా అతడు కీలక పాత్రలు పోషించారు. తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం షైన్ టామ్ చాకోపై కొనసాగుతున్న విచారణ నేపథ్యంలో ఆయన భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా అనేక సందేహాలు కలుగుతున్నాయి. పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.