మలయాళ నటుడు అజిత్ విజయన్ కన్నుమూత
మలయాళ సినీ నటుడు అజిత్ విజయన్ (57) ఫిబ్రవరి 9న కొచ్చిలో మరణించారు. ఆయన మృతికి గల కారణాన్ని అధికారికంగా వెల్లడించలేదు. అజిత్ విజయన్ భార్య ధన్య, కుమార్తెలు గౌరి, గాయత్రి ఉన్నారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సహనటులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు.
అజిత్ విజయన్ నటించిన పాత్రల్లో అత్యధికంగా గుర్తింపు పొందింది బెంగళూరు డేస్ లోని జ్యోతిష్కుడి పాత్ర. కేవలం ఒకటి రెండు సీన్లలో మాత్రమే కనిపించినా, ఆ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో నజ్రియాకు జాతకం చెప్పి, త్వరగా పెళ్లి చేయించాలని సూచించే పాత్రను ఆయన పోషించారు. తమిళంలోనూ ఇదే పాత్రను అజిత్ విజయన్ నే పోషించగా, అక్కడ కూడా మంచి గుర్తింపు లభించింది.
‘అమర్ అక్బర్ ఆంతోని, అంజు సుందరిగళ్, ఒరు ఇండియన్ ప్రణయ కథ’ వంటి మరికొన్ని చిత్రాల్లోనూ అజిత్ నటించారు. ఆయన రాజకీయ నాయకుడిగా కనిపించిన పాత్రకూ మంచి ప్రశంసలు లభించాయి. చిన్న పాత్రలైనా, అజిత్ విజయన్ నటన ప్రతిసారీ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
అజిత్ కళా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన తాత కళామండలం కృష్ణన్ నాయర్ ప్రఖ్యాత కథకళి ఆచార్యుడు. తాతమ్మ కళామండలం కల్యాణికుట్టియమ్మ ప్రసిద్ధ మోహినీయాటం నర్తకురాలు. అంతేగాక, ప్రముఖ నటుడు కళాశాల బాబు అజిత్ విజయన్ కు మామయ్య అవుతారు. అజిత్ తండ్రి సీ.కే.విజయన్, తల్లి కళ విజయన్ కూడా కళారంగంలో ప్రఖ్యాతులు. కళ విజయన్ మోహినీయాట్టం నర్తకురాలు. సినిమా, టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన అజిత్ విజయన్ అకాల మరణం మలయాళ సినీ రంగాన్ని శోకసంద్రంలో ముంచేసింది