ప్రీసేల్స్ లో అదరగొడుతోన్న ‘ఎల్ 2 : ఎంపురాన్’
శని, ఆదివారాల ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ₹55 కోట్లు దాటేసాయి, దీని వల్ల ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.;
మలయాళ సినీ పరిశ్రమ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో.. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన "L2: ఎంపురాన్" భారీ బాక్సాఫీస్ తుఫానుగా మారేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకు ముందు వరకు, ఎక్కువగా పరిమితి బడ్జెట్ లోనే తెరకెక్కి.. విజయం సాధించిన మలయాళ సినిమాలు... ఇప్పుడు జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
"L2: ఎంపురాన్" దక్షిణాది నుంచే కాకుండా ఉత్తరాది, జర్మనీ వంటి దేశాలలో కూడా అద్భుతమైన స్పందనను పొందుతోంది. శని, ఆదివారాల ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ₹55 కోట్లు దాటేసాయి, దీని వల్ల ఈ చిత్రం భారీ ఓపెనింగ్‌కు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. ప్రీ-సేల్స్ ద్వారా డే 1 వసూళ్లు ₹50 కోట్లు దాటే అవకాశముంది. మలయాళ చిత్రమైనప్పటికీ, ఇతర భాషలలో విస్తృతంగా డబ్బింగ్ లేకుండానే "L2: ఎంపురాన్" సంచలన విజయాన్ని నమోదు చేయబోతోంది. అసలు విషయం ఏమిటంటే, కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని మళ్లీ నిరూపిస్తోంది.
2019లో విడుదలైన "లూసిఫర్" ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹125.50–127 కోట్లు వసూలు చేసింది. కానీ, ఈసారి "ఎంపురాన్" దానికి మించి ₹400 కోట్లు మార్క్ చేరుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్ర విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, ఈ సినిమాపై ఉత్సాహం అమాంతంగా పెరుగుతోంది. "L2: ఎంపురాన్" మలయాళ చిత్ర పరిశ్రమలో కొత్త రికార్డులను నెలకొల్పుతుందా? ఈ సినిమా ఎలాంటి కొత్త మైలురాళ్లు సాధిస్తుందో చూడాలి.