మాలీవుడ్ లో జోజు జార్జ్ వివాదం !

అశ్లీల భాష ఉపయోగం గురించి తనను తప్పుదారి పట్టించారని, అవార్డుల కోసం మాత్రమే ఆ వెర్షన్‌ను ఉపయోగిస్తామని చెప్పి, తర్వాత దాన్నే పబ్లిక్‌కి రిలీజ్ చేశారని జోజు ఆరోపించారు.;

By :  K R K
Update: 2025-06-27 02:14 GMT

మాలీవుడ్ విలక్షణ నటుడు జోజు జార్జ్... ఇటీవల ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘చురుళి’ అనే సినిమా షూటింగ్ అనుభవం గురించి, రిలీజ్ తర్వాత ఎదురైన వివాదం గురించి మాట్లాడారు. ఈ సినిమాలో అశ్లీల భాష ఉపయోగం గురించి తనను తప్పుదారి పట్టించారని, అవార్డుల కోసం మాత్రమే ఆ వెర్షన్‌ను ఉపయోగిస్తామని చెప్పి, తర్వాత దాన్నే పబ్లిక్‌కి రిలీజ్ చేశారని జోజు ఆరోపించారు. అంతేకాదు, తనకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని, ఈ నిర్ణయాల గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, సినిమాలోని భాష వల్ల తనకు మానసిక ఒత్తిడి కలిగిందని వాపోయారు.

తాజాగా.. ఫిల్మ్‌మేకర్ లిజో జోస్ పెల్లిస్సేరి మౌనం వీడి, జోజు జార్జ్ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలు గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారాయి. లిజో తన ప్రకటనలో, నిర్మాతలకు కలిగిన ఇబ్బందుల కారణంగా ఈ స్పష్టీకరణ ఇస్తున్నట్లు చెప్పారు. ‘చురుళి’ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఉందని, ఇప్పటివరకు సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదని తెలిపారు. సంబంధిత కమిటీతో చర్చించామని, సినిమాలో భాష ఉపయోగం గురించి హైకోర్టు తీర్పు కూడా ఉందని పేర్కొన్నారు. జోజును తప్పుదారి పట్టించామన్న ఆరోపణను ఖండిస్తూ.. “ ఈ సినిమా తీస్తున్నప్పుడు నిన్ను తప్పుదారి పట్టించినట్లు ఎవరికీ గుర్తు లేదు” అని అన్నారు. జోజుకు తన పాత్ర గురించి ఈ భాష గురించి మంచి అవగాహన ఉందని సూచనాత్మకంగా వ్యాఖ్యానించారు.

రెమ్యూనరేషన్ విషయంలో.. చెంబోస్కీ మోషన్ పిక్చర్స్, జోజుకు మూడు రోజుల గెస్ట్ రోల్ కోసం చెల్లింపుల వివరాలను డాక్యుమెంట్ చేసిందని లిజో తెలిపారు. 2019–2020 ఆర్థిక సంవత్సర లెడ్జర్ ప్రకారం, జోజు కు మొత్తం 5,90,000 రూపాయలు చెల్లించారు. ఇందులో ఆర్టిస్ట్ ఫీజుగా 5,00,000 రూపాయలు, జీయస్టీ కింద ఒక్కొక్కటి 45,000 రూపాయలు ఉన్నాయి.

‘చురుళి’ ప్రస్తుతం సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోందని, అవకాశం వస్తే థియేటర్లలో రిలీజ్ చేస్తామని లిజో చెప్పారు. ఈ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్‌లో, ఇద్దరు అండర్‌కవర్ పోలీసులు ఒక పరారీలో ఉన్న వ్యక్తి కోసం చురుళి అనే రిమోట్ గ్రామానికి వెళతారు. అక్కడ వారు వింత, సర్రియల్ ప్రపంచంలో చిక్కుకుంటారు, గ్రామస్థుల ప్రవర్తన అనూహ్యంగా ఉంటుంది, రియాలిటీ సరిహద్దులు మసకబారతాయి. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలో ప్రీమియర్ అయింది, అక్కడ విస్తృత ప్రశంసలు అందుకుంది. చాలా మంది విమర్శకులు, సినీ అభిమానులు దీన్ని ధైర్యమైన, ఆకర్షణీయమైన చిత్రంగా కొనియాడారు, అయితే అశ్లీల భాష వల్ల వివాదం కూడా రేగింది.

Tags:    

Similar News