రెండేళ్ళ గ్యాప్ తర్వాత మాలీవుడ్ కు మళ్ళీ దుల్కర్ సల్మాన్ !

Update: 2025-03-02 11:51 GMT

‘కింగ్ ఆఫ్ కొత్త’ తరువాత రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత.. దుల్కర్ సల్మాన్ మళ్లీ మళయాళ చిత్రసీమకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. నహాస్ హిధాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఐయామ్ గేమ్’ అనే చిత్రంతో ఆయన మళ్లీ మళయాళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శనివారం ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్స్ లో రెండు చేతులు కనిపిస్తున్నాయి. ఒక చెయ్యి గాయపడినట్లు ఉండగా, దానిలో క్రికెట్ బంతి పట్టుకుని ఉంది. మరో చేతిలో ఓ తగలబడుతున్న క్రీడాకారుల ప్లేయింగ్ కార్డు కనిపిస్తోంది.

ఈ సినిమా ‘ఆర్డీఎక్స్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నహాస్ హిధాయత్ చేస్తున్న రెండో సినిమా. కథను నహాస్ స్వయంగా రాయగా.. స్క్రీన్‌ప్లేను సజీర్ బాబా, బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబక్కర్ కలిసి రచించారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ కలిసి ‘వేపారర్ ఫిలిమ్స్’ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. మళయాళంతో పాటు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మరో రెండు మళయాళ సినిమాలకు అంగీకరించారు. ఒకటి ‘పరవా’ చిత్ర దర్శకుడు సౌబిన్ షాహిర్ తెరకెక్కిస్తుండగా, మరొకటి ఓ కొత్త దర్శకుడి డెబ్యూట్ ప్రాజెక్ట్. అలాగే, తమిళంలో సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా ‘కాంత’, పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’ కూడా దుల్కర్ ఫ్యూచర్ లైనప్‌లో ఉన్నాయి.

Tags:    

Similar News