డ్రగ్స్ కేసులో దసరా విలన్ !
కోచ్చి లోని ఓ హోటల్‌లో జరిగిన యాంటీ-డ్రగ్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ దాడి నుంచి పారిపోయినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.;
ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తాజాగా వివాదాల్లో చిక్కుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు "దసరా, రంగబలి, దేవర, రాబిన్‌హుడ్" వంటి చిత్రాలతో తెలుగువారిని బాగా మెప్పించిన షైన్.. కోచ్చి లోని ఓ హోటల్‌లో జరిగిన యాంటీ-డ్రగ్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ దాడి నుంచి పారిపోయినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.
పోలీసుల సమాచారం ప్రకారం, మత్తు పదార్థాల వినియోగదారులు, సరఫరాదారులపై దాడి సందర్భంగా, హోటల్ రిజిస్టర్లో షైన్ టామ్ చాకో పేరు నమోదు అయి ఉన్నట్లు గుర్తించారు. అయితే దాడి సమయంలో అతడు అక్కడ లేకపోవడం అనుమానాలు రేపింది. ప్రస్తుతం అతను హోటల్ నుంచి పరుగెత్తుతూ ఉన్నట్లు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో, షైన్ టామ్ చాకోను విచారణ కోసం సమన్లు జారీ చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక మరో పక్క.. మలయాళ నటి విన్సీ అలోషియస్, షైన్ పై ఆరోపణలు మోపారు. ‘సూత్రవాక్యం’ అనే మూవీ చిత్రీకరణ సమయంలో.. మత్తు ప్రభావంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఈ పరిణామాలతో, షైన్ టామ్ చాకోపై మత్తు పదార్థాల సంబంధిత ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పోలీసుల విచారణ ఫలితాలపై ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా కన్నేశారు.