‘దృశ్యం 3’ పై అంచనాలు తగ్గిస్తున్న దర్శకుడు
కొత్త సినిమాను మునుపటి రెండు చిత్రాలతో పోల్చవద్దని.. ఇది వేరే విధంగా ఉంటుందని, మునుపటి భాగాల్లోలా అత్యంత ఉత్కంఠభరిత సన్నివేశాలను ఆశించే వారు నిరాశపడవచ్చని ఆయన స్పష్టం చేశారు.;
సాధారణంగా సినిమా దర్శకులు తమ సినిమాల గురించి అంచనాలను పెంచడానికి ప్రయత్నిస్తారు. కానీ.. హైప్‌ను తగ్గించడానికి ప్రయత్నించడం అరుదు. ఇది మలయాళ చిత్ర పరిశ్రమలో తరచూ కనిపిస్తుంది. ఉదాహరణకు, ‘లోక’ సినిమా ఊహించని విధంగా భారీ హైప్‌ను సృష్టించినప్పుడు.. కళ్యాణి అండ్ టీమ్ ప్రేక్షకులను ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దని కోరారు. ఇప్పుడు ‘దృశ్యం’ ఫ్రాంచైజీ దర్శకుడు జీతు జోసెఫ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు.
మోహన్‌లాల్‌తో ఆయన చేసిన ‘దృశ్యం, దృశ్యం 2’ చిత్రాలు చరిత్ర సృష్టించాయి. మొదటి సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డులను బద్దలు కొట్టగా.. కోవిడ్ సమయంలో ఓటీటీలో విడుదలైన రెండో సినిమా కూడా అద్భుతమైన ఆదరణ పొందింది. దీంతో.. ‘దృశ్యం 3’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్క్రిప్ట్ సిద్ధమై, త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, జీతు జోసెఫ్ ముందుగానే ప్రేక్షకులకు హెచ్చరికలు జారీ చేశారు.
కొత్త సినిమాను మునుపటి రెండు చిత్రాలతో పోల్చవద్దని.. ఇది వేరే విధంగా ఉంటుందని, మునుపటి భాగాల్లోలా అత్యంత ఉత్కంఠభరిత సన్నివేశాలను ఆశించే వారు నిరాశపడవచ్చని ఆయన స్పష్టం చేశారు. ‘దృశ్యం, దృశ్యం 2’ మూవీస్ లో మోహన్‌లాల్ తెలివైన మైండ్ గేమ్‌లు, ఊహించని ట్విస్ట్‌లు హైలైట్‌గా నిలిచాయి. సహజంగా.. కొత్త భాగంలో కూడా అలాంటి ఎపిసోడ్‌లను ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
అయితే, ఈసారి ట్విస్ట్‌లు, థ్రిల్స్ కంటే భావోద్వేగ కోణం ఎక్కువగా ఉంటుందని జీతు స్పష్టం చేశారు. ఈ మార్పు ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుందా అనేది చూడాలి. అయినప్పటికీ, జీతు జోసెఫ్ అండ్ మోహన్‌లాల్ మరోసారి తెరపై మ్యాజిక్ సృష్టించి, మరో పెద్ద విజయాన్ని అందిస్తారని అభిమానులు నమ్ముతున్నారు.