మాలీవుడ్ కు కొత్త విలన్ దొరికాడు !
మోహన్‌లాల్, శోభనల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా... మరొక నటుడు మాత్రం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.;
ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా.. తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన 'తుడరుమ్' మలయాళ సినిమా.. థియేటర్లలో మంచి విజయం సాధించింది. సినిమా ప్రత్యేకమైన కథనంతో తెరకెక్కడంతో పాటు ప్రధాన నటుల అదిరిపోయే అభినయానికి ప్రశంసలు లభిస్తున్నాయి. మోహన్‌లాల్, శోభనల స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా... మరొక నటుడు మాత్రం అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
చిత్రం చూసినవారందరికీ ఒకే ప్రశ్న.. ఇందులో జార్జ్ పాత్రను నటించినవాడు ఎవరు? అతని నటన మోహన్‌లాల్, శోభనల స్థాయిలో ఉండటమే కాకుండా, విలన్ పాత్రలో భయానకమైన ప్రభావాన్ని చూపించి ప్రశంసలందుకున్నాడు. అతడి పేరు ప్రకాష్ వర్మ. ప్రకాశ్ వర్మ దేశంలోనే.. ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్లలో ఒకరు. ఇండియాలో సంచలనం సృష్టించిన జూజూ యాడ్స్, అలాగే టెలికాం సేవల కోసం చేసిన "బోయ్ అండ్ పప్పీ" ప్రకటనల ద్వారా అతడికి విస్తృత గుర్తింపు వచ్చింది.
ప్రకాశ్ వర్మ బెంగళూరులోని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్వాణ ఫిలిమ్స్‌ను స్థాపించాడు. 2001లో తన భార్య స్నేహా ఐపే తో కలిసి ఈ సంస్థను ప్రారంభించాడు. నిర్వాణ ఫిలిమ్స్ దేశంలోని ఎన్నో ప్రముఖ బ్రాండ్‌లకు యాడ్స్ రూపొందించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా, అమెజాన్ ప్రైమ్ వంటి దిగ్గజ బ్రాండ్‌ల యాడ్స్ కూడా ఈ సంస్థ ద్వారా తెరకెక్కాయి. సినీ రంగంలోకి రాకముందు ప్రకాష్.. మలయాళ ప్రముఖ దర్శకుడు విజి తంపి వద్ద శిష్యరికం చేశాడు. తరువాత ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ వి.కె. వర్మ వద్ద పనిచేసి అనుభవం సొంతం చేసుకున్నాడు.
ప్రకాశ్ వర్మ తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. కేరళ టూరిజం ప్రచార కార్యక్రమాలు, షారుక్ ఖాన్‌తో కలిసి చేసిన దుబాయ్ టూరిజం ప్రచారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 2009లో హాలీవుడ్ దర్శకుడు మైకల్ బెయ్ నిర్వహించే 'ది ఇన్‌స్టిట్యూట్' సంస్థ ప్రకాష్ వర్మను సైన్ చేయడం అతడి కెరీర్‌లో పెద్ద మలుపు.
'తుడరుమ్' సినిమా ప్రారంభంలో ప్రకాష్ వర్మ పాత్ర చిన్నదే అనుకుని చాలామంది నిర్లక్ష్యం చేశారు. కానీ దర్శకుడు తరుణ్ మూర్తి జార్జ్ పాత్రను అద్భుతంగా మలచి, ప్రధాన విలన్‌గా నిలిపారు. ఫలితంగా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన "సర్ ప్రైజ్ ఎలిమెంట్"గా ప్రకాష్ నిలిచాడు.