9 అవార్డుల్ని గెలుచుకొన్న పృధ్విరాజ్ సుకుమారన్ సినిమా
'ఆడుజీవితం'.. 2023 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల పంట పండించింది. అత్యుత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (పురుషుడు) పురస్కారాలతో సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.;
పృధ్విరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఆడు జీవితం 2023 సంవత్సరానికి గాను అవార్డుల పంట పండించింది. బెన్యామిన్ నవల ఆధారంగా రూపొందిన 'ఆడుజీవితం'.. 2023 కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాల పంట పండించింది. అత్యుత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు (పురుషుడు) పురస్కారాలతో సహా మొత్తం తొమ్మిది విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది.
ఒక ఎమిగ్రెంట్ జీవితాన్ని సౌందర్యాత్మకంగా.. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో చూపించినందుకు జ్యూరీ డైరెక్టర్ బ్లెస్సీకి ఉత్తమ దర్శకుడిగా అవార్డు ప్రదానం చేసింది. నజీబ్ పాత్ర కోసం కష్టతరమైన మేకోవర్ చేసినందుకు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో మనిషి జీవించాలనే తపనను, నిస్సహాయతను తన శరీర భాష ద్వారా సహజంగా వ్యక్తీకరించినందుకు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు.
'ఆడుజీవితం' చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు అందుకున్న సునిల్ కె.ఎస్, కథలోని భావోద్వేగాలను సమర్ధవంతంగా చూపించినందుకు ప్రశంసలు పొందారు. బెస్లీకి ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టేషన్) అవార్డూ లభించింది. జ్యూరీ ప్రకారం.. మలయాళంలో ఒక గొప్ప సాహిత్య కృతిని సినిమాటిక్‌గా అత్యుత్తమంగా మలచడంలో ఆయన నైపుణ్యం చూపించారు.
బెస్లీతో పాటు, రెసూల్ పోకుట్టి, శరత్ మోహన్ కలిసి ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డును గెలుచుకున్నారు. వివిధ ప్రదేశాలు, కాలాల శబ్దాలను, మాటలను, సంగీతాన్ని సమపాళ్లలో మిళితం చేసిన తీరు వారికి గుర్తింపు తెచ్చింది. రెంజిత్ అంబాడి ఉత్తమ మేకప్ కళాకారుడిగా అవార్డును గెలుచుకున్నారు. పాత్రల కాల గమనాన్ని, పరిణామాలను ప్రతిబింబించే మేకప్ పనితనం ఆయన విజయానికి కారణమైంది.
'ఆడుజీవితం'లో కీలక పాత్ర పోషించిన కె.ఆర్. గోకుల్, ఎడారి మధ్య జీవించేందుకు చేసిన నిస్సహాయ ప్రయత్నాలను సహజంగా చూపించినందుకు ప్రత్యేక జ్యూరీ ప్రశంసను అందుకున్నారు. ఆయన అభినయం ప్రధాన పాత్ర అభినయానికి సమానంగా ఉన్నదని జ్యూరీ పేర్కొంది.