"చిరు" చేస్తున్న "మెగా" ప్రయత్నం

Update: 2025-08-19 07:55 GMT

టాలీవుడ్ కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. 15 రోజులుగా జరుగుతున్న సమ్మెను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నిర్మాతల మధ్య, అటు కార్మికుల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించి, సమస్యను పరిష్కరించేందుకు చిరంజీవి చొరవ తీసుకున్నారు.

వేతనాలు 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికుల చేస్తున్న సమ్మె కారణంగా టాలీవుడ్ లో షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి.  2 వేల రూపాయల కంటే తక్కువ జీతం ఉన్నవారికి 25 శాతం జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకు వచ్చినప్పటికీ, కొన్ని కండిషన్లు పెట్టడంతో కార్మికులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో సమస్య మరింత జఠిలమైంది.ఈ నేపథ్యంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌కు చెందిన కొంతమంది నిర్మాతలు చిరంజీవిని కలిసి సమస్యను వివరించారు. తర్వాత నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ, ‘సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవి చెప్పారు. 

ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చారని తెలిపారు.

ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ డిమాండ్లను స్పష్టం చేశారు. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో చిరంజీవి మాట్లాడారు..నిర్మాతలు మా మాట వినకుండా మాపైనే నిందలు వేస్తున్నారని, మాకు కుదరని నిబంధనలు పెడుతున్నారని ఆయనకు చెప్పారు. 

మేము బాగుండాలి, అలాగే నిర్మాతలు కూడా బాగుండాలని చెప్పారు. పరిష్కారం దిశగా  అడుగులు 

నిర్మాతలు పెట్టిన రెండు నిబంధనలకు ఒప్పుకుంటే తామేం నష్టపోతామో చిరంజీవికి వివరించామని, డబుల్ కాల్ షీట్ గురించి కూడా చెప్పామని అనిల్ పేర్కొన్నారు. 

మాకు ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు రమ్మని చిరంజీవి చెప్పారు.

మరోవైపు నిర్మాతలు కూడా ఫిలిం ఛాంబర్‌లో సమావేశమై సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్ భూషణ్ కు అప్పగించారు. దీంతో త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని, సమస్య పరిష్కారమవుతుందని నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. ఈ పరిణామాలతో టాలీవుడ్ సాధారణ స్థితికి వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ఇది అంతా చూసేందుకు "చిరు" ప్రయత్నంలా ఉన్నా దీని వెనుక "మెగా" కృషి ఉంది.

ఎందుకంటే ఆయనకు స్టూడియోస్ లేవు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదు, థియేటర్స్ & మల్టీప్లెక్స్ లేవు, క్యూబ్ వంటి వాటిలో షేర్స్ లేవు, ప్రింట్, శాటిలైట్ & డిజిటల్ మీడియాలు లేవు..

ఆయనకు తెలిసింది ఒక్కటే..

సమాజసేవ కోసం బ్లడ్ బ్యాంక్, నిర్మాతలు, డైరెక్టర్స్ చెప్పిన టైమ్ కి షూటింగ్ కు రావడం..అలాగే తన దగ్గరకు వచ్చిన వారికి తాను ఏ విధంగా సహాయం చెయ్యగలను అని ఆలోచించడం తప్ప..

వై.జె.ఆర్

Tags:    

Similar News