పర్యావరణం వివాదంలో చిక్కుకున్న యశ్ మూవీ !

గత ఏడాది అక్టోబర్‌లో బెంగళూరులోని పీన్య ప్రాంతంలో జరిగిన చిత్రీకరణతో ఈ వివాదం ప్రారంభమైంది.;

By :  K R K
Update: 2025-01-22 01:59 GMT

‘కెజిఎఫ్’ తరువాత యష్ నటిస్తున్న తాజా చిత్రం ‘టాక్సిక్’ వివాదాల మధ్య చిక్కుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో బెంగళూరులోని పీన్య ప్రాంతంలో జరిగిన చిత్రీకరణతో ఈ వివాదం ప్రారంభమైంది. చిత్రబృందం అనుమతులు లేకుండా వందలాది చెట్లను నరికి, పచ్చదనాన్ని హరించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఆరోపణలపై స్పందించిన అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ప్రత్యక్షంగా పీన్యను సందర్శించి పరిస్థితేంటో తెలుసుకున్నారు. అనుమతులు లేకుండా రిజర్వ్ ఫారెస్ట్‌లో వందలాది ఎకరాల భూమిని చదును చేయడం నిజమని ఆయన నిర్ధారించి, ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం టాక్సిక్ నిర్మాతలకు ప్రభుత్వం తరఫున నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ మెషీన్ టూల్స్ అనే సంస్థకు కట్టబెట్టారనే అంశంపై విచారణ జరుగుతోంది. కేబినెట్ ఆమోదం లేకుండా డీనోటిఫికేషన్ అప్రూవల్ చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లడం వల్ల ఈ వివాదం త్వరగా ముగిసే సూచనలు కనిపించడం లేదు.

టాక్సిక్ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ఆశించినా, ఈ వివాదాలు ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే టీజర్‌పై ప్రేక్షకుల నుంచి నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. యాక్షన్ ఎలివేషన్స్ కంటే రొమాన్స్ ఎక్కువగా చూపించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. మరో కీలక పాత్రలో నయనతార నటిస్తున్నారని ఊహాగానాలు ఉన్నా, చిత్రబృందం దీనిపై అధికారికంగా స్పందించలేదు. ఈ సినిమా బడ్జెట్ రూ. 300 కోట్లకు పైగా ఉండవచ్చని సమాచారం.

Tags:    

Similar News