పాన్ వరల్డ్ మూవీగా కన్నడ రాక్ స్టార్ చిత్రం

ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా.. భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నంగా రూపొందిస్తున్నారు.;

By :  K R K
Update: 2025-02-09 01:36 GMT

‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న యశ్, ప్రతిభావంతమైన దర్శకురాలు గీతు మోహందాస్‌ కాంబినేషన్ లో కలిసి వెరైటీ గ్యాంగ్‌స్టర్ డ్రామా "టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్‌స్" తెరకెక్కి్స్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే విశేషమైన ఆసక్తిని రేకెత్తించగా.. కియారా అద్వాణి, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా వంటి శక్తివంతమైన తారాగణం ఈ చిత్రంలో భాగమయ్యారు.

ఈ సినిమాను గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా.. భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నంగా రూపొందిస్తున్నారు. సినిమా కథ అంతర్జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉండటంతో, చిత్రబృందం అంతర్జాతీయ స్థాయి నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసింది. ఈ చిత్రం ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది. అలాగే, ఇతర ప్రధాన భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు.

ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్‌ అధినేత వెంకట్ కె నారాయణ, యాష్ యొక్క మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ ద్విభాషా చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడమన్న లక్ష్యంతో మేకింగ్ ఖర్చులు దాదాపు 40 శాతం పెరిగాయి. కానీ, ఈ భారీ పెట్టుబడికి తగిన ఫలితాన్ని తెచ్చిపెట్టేలా సినిమాను గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా తీర్చిదిద్దుతున్నామని నిర్మాతలు అంటున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ఖరీదైన చిత్రాల్లో ఒకటిగా ఇది నిలవనుంది.

గీతు మోహందాస్ ఇప్పటికే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులను గెలుచుకుని, అంతర్జాతీయ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక, ఈ చిత్రానికి హాలీవుడ్ నుంచి "జేజే పెర్రీ" అనే ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్ పని చేస్తున్నారు. ఆయన "ఐరన్ మాన్", "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్", "జాన్ విక్" వంటి వరల్డ్ ఫేమస్ చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా "టాక్సిక్" తెరకెక్కుతుండటంతో, యశ్ అభిమానులే కాకుండా, సినిమా ప్రేమికులు కూడా దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News