‘బిల్లా రంగ బాషా’ గా కిచ్చా సుదీప్

Update: 2025-02-24 06:00 GMT

‘మాక్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన కిచ్చా సుదీప్.. తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నా.. త్వరలో కొత్త సినిమాను ప్రారంభించబోతున్నట్టు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఆ సినిమా పేరు ‘బిల్లా రంగ బాషా’. ఈ చిత్రం షూటింగ్ మార్చి రెండో వారం నుండి ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించాడు. ఈ వార్త అభిమానులను ఆనందంలో ముంచేసింది.

‘విక్రాంత్ రోణ’ తర్వాత.. దర్శకుడు అనూప్ భండారితో సుదీప్ మరోసారి చేతులు కలుపుతున్నాడు. ఈ సినిమా కథ రెండు శతాబ్దాల తరువాత భవిష్యత్తు నేపథ్యంలో సాగుతుందని సమాచారం. దీన్ని రెండు భాగాలుగా రూపొందించనున్నారు. చిత్ర బృందం ప్రత్యేక సెట్లను నిర్మించేందుకు బెంగళూరు శివారులో నాలుగు ఎకరాల భూమిని లీజుకు తీసుకుంది. ‘హను-మాన్’ వంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే కిచ్చా క్రియేషన్స్ కూడా భాగస్వామ్యం కానుంది.

దర్శకుడు అనూప్ భండారి ప్రాజెక్ట్ స్థాయిని వివరిస్తూ, వీఎఫ్ ఎక్స్, త్రీడీ సెట్లకు భారీ ప్రణాళికలు వేశామని తెలిపారు. ఈ సినిమా త్రీడీ, టూడీ ఫార్మాట్లలో విడుదల కానుండడంతో.. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించనుంది. ప్రధాన తారాగణం దాదాపుగా ఖరారై, త్వరలో మరికొంతమంది నటీనటులు జతకానున్నారు. నిరంతరంగా 20-25 రోజుల పాటు చిత్రీకరణ కొనసాగించనున్నారు. కొత్త సెట్లు ఒకదాని వెంట మరొకటి సిద్ధం అవుతూనే ఉంటాయి. మిగిలిన సాంకేతిక వివరాలు, తారాగణాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Tags:    

Similar News