టికెట్ రేట్లపై కర్ణాటక కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరల నియంత్రణకు కీలక చర్యలు చేపట్టింది.;
కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరల నియంత్రణకు కీలక చర్యలు చేపట్టింది. 1964లోని సినిమాల నియంత్రణ చట్టాన్ని ఆధారంగా చేసుకుని ‘కర్ణాటక సినిమాస్ రెగ్యులేషన్ రూల్స్-2025’ ముసాయిదాను విడుదల చేసింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో టికెట్ ధరను రూ.200కి పరిమితం చేసింది. ఈ ధరలో వినోదపు పన్ను కూడా చేర్చబడుతుంది.
ఈ నిర్ణయం అన్ని భాషల చిత్రాలకు, అన్ని థియేటర్లకు వర్తించనుంది. ఇందులో ఏవైనా అభిప్రాయాలు లేదా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోపు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. 2025-26 బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని సీఎం సిద్ధరామయ్య ప్రకటించగా, ఇప్పుడు దానికి అనుగుణంగా అధికారికంగా ముసాయిదా నోటిఫికేషన్ జారీ అయింది. సామాన్యులకు సినిమా మరింత అందుబాటులోకి రావాలన్నదే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాధారణ ప్రేక్షకులకు ఊరటనిస్తుంది. అయితే భారీ బడ్జెట్ చిత్రాలకు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఇది ఆర్థికంగా గట్టి ఎదురుదెబ్బగా మారనుంది. మల్టీప్లెక్స్‌లలో సాధారణంగా రూ. 600-1000 వరకు ఉండే టికెట్లు ఇప్పుడు రూ. 200కు పరిమితం కావడంతో, ఆదాయంలో 30% తగ్గుదల ఏర్పడే అవకాశముందని అంచనా.
కర్ణాటకలో తెలుగు, తమిళ సినిమాలకు విశేష మార్కెట్ ఉండగా, టికెట్ ధరలు తగ్గిపోవడంతో ఓపెనింగ్ వసూళ్లు బాగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు రాబోయే ‘హరిహర వీరమల్లు, కింగ్డమ్, వార్ 2, కూలీ‘ వంటి పాన్-ఇండియా సినిమాల కర్ణాటక వసూళ్లపై పెద్ద ప్రభావం పడనుంది. ఒకవేళ తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధానం అమలైతే, భారీ బడ్జెట్ చిత్రాల బడ్జెట్ విషయంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి.