‘అవతార్ 3’ పై ఆసక్తి పెంచుతోన్న జేమ్స్ కామెరూన్
=హాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయికి ఎదిగిన దర్శకుల్లో జేమ్స్ కామెరూన్ ఒకరు. అత్యధిక వసూళ్లు సాధించిన ఎన్నో సినిమాలను తెరకెక్కించిన ఈ ప్రతిభావంతుడైన దర్శకుడు, తన తదుపరి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘అవతార్ 3’ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘అవతార్: ఫైర్ అండ్ ఆష్’ పేరుతో రూపొందుతున్న ఈ మూడో భాగం గురించి కామెరూన్ తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన... కొన్ని ప్రత్యేక వ్యక్తులకు ఈ చిత్రాన్ని ఇప్పటికే చూపించానని, వారి అభిప్రాయంలో ఇది ఇప్పటివరకు వచ్చిన మూడు భాగాల్లో అత్యంత భావోద్వేగభరితమైనదని, అంతేకాకుండా మరింత అద్భుతమైనదిగా ఉందని చెప్పారు.
న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ‘అవతార్’ సిరీస్ లోని మొత్తం ఐదు భాగాల చిత్రీకరణను పూర్తి చేయాలనే తన ఆలోచన గురించి కూడా కామెరూన్ వివరించారు. ఆయన చెప్పిన ప్రకారం... నాలుగో, ఐదో భాగాల రూపకల్పన ఇప్పటికే పూర్తయిందని, వీటి కోసం మరో ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పట్టొచ్చని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా పలు కొత్త ఉద్యోగాలను సృష్టించగలి గామని కామెరూన్ తెలిపారు. “మనం నాలుగో, ఐదో భాగాలను కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతామని ఆశిస్తున్నాను” అని, ఇప్పుడు తనను "జిమ్" అని పిలవడం ఇష్టమని కూడా ఆయన తెలిపారు.
అవతార్ మూడో భాగంలో కూడా సామ్ వర్తింగ్టన్ (జేక్ సల్లి), జోయి సల్డానా (నెయిటిరి), సిగౌర్నీ వీవర్ (కిరి), స్టీఫెన్ లాంగ్ (మైల్స్ క్వారిచ్) వంటి ప్రముఖ నటులు తమ పాత్రలను మళ్లీ పోషించనున్నారు. ‘అవతార్’ సిరీస్ లో ప్రతి భాగం ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటూ, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. మరి ‘అవతార్ 3: ఫైర్ అండ్ అష్’ కూడా ఇదే విజయపథాన్ని కొనసాగిస్తుందా? వేచి చూడాలి!