తన పేరులోని తండ్రి పేరును తొలగించిన యంగ్ హీరో

Update: 2025-03-10 10:41 GMT

చియాన్ విక్రమ్ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదగడానికి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాడు. దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాల తర్వాతే ఆయనకు స్టార్ డమ్ వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న విక్రమ్ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు ధ్రువ్ విక్రమ్. తన తొలి ప్రయత్నంగా విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘ఆదిత్య వర్మ’లో హీరోగా పరిచయమయ్యాడు ధ్రువ్.

అయితే, ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఫలితంగా ఆయనకు అవకాశాలు అందుబాటులో రాలేదు. తర్వాత తండ్రితో కలిసి ‘మహాన్’లో నటించాడు. ఈ సినిమా ప్రతికూలతలు లేకపోయినా, భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. కేవలం నటనతోనే కాకుండా, సంగీతంలో కూడా తన ప్రతిభను నిరూపించుకున్న ధ్రువ్... ‘హాయ్ నాన్న’ చిత్రంలోని ‘ఓడియమ్మ’ పాటను తెలుగులో ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడీ హ్యాండ్సమ్ హీరో మూడేళ్ల గ్యాప్ తర్వాత ‘బైసన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘పరియేరుమ్ పెరుమాల్’ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

‘తంగలాన్’ దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ధ్రువ్ భిన్నమైన గెటప్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ సినిమా నుంచి ధ్రువ్ తన పేరులోని తండ్రి పేరును తొలగిస్తూ ఓన్లీ ధ్రువ్ గానే రాబోతున్నాడు. ఇది తను ప్రత్యేక గుర్తింపును పొందడానికి తీసుకున్న నిర్ణయమని భావిస్తున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. తండ్రికి తగ్గ తనయుడిగా ధ్రువ్ నిలిచేనా? ఆయన నటన కొత్త మైలురాయిని అందుకోగలదా? అన్నది ‘బైసన్’ విడుదలయ్యాక తెలుస్తుంది.

Tags:    

Similar News