దర్శకుడు శంకర్ నెక్స్ట్ మూవీ ఏంటి?
‘ఇండియన్ 2, గేమ్ చేంజర్’ సినిమాలతో భారీ పరాజయాలను చవిచూశారు దర్శకుడు శంకర్. ఈ పరిస్థితుల్లో ఆయన తన తదుపరి చిత్రాన్ని నిర్మించేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ‘గేమ్ చేంజర్’ ప్రకటనకు ముందు.. శంకర్ బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్‌తో సినిమా చేస్తానని వెల్లడించారు. అది “అపరిచితుడు” (అన్నియన్) రీమేక్ కావొచ్చని ప్రచారం జరిగింది.
అయితే, రణవీర్ సింగ్ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను వదిలిపెట్టి ఇతర సినిమాలపై దృష్టి సారించాడు. త్వరలోనే అతను ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కే “డాన్ 3” షూటింగ్‌లో పాల్గొననున్నాడు. గత ఏడాది శంకర్ మాట్లాడుతూ.. ‘అపరిచితుడు’ కన్నా గొప్ప సినిమా చేయాలని యోచిస్తున్నాం. ‘గేమ్ చేంజర్’ విడుదలైన తర్వాత దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది నిర్ణయిస్తాం” అని మీడియాకు తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం, శంకర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల కారణంగా రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్‌ను చేయడం సురక్షితం కాదని భావించాడు. అంతేకాదు, రణవీర్ సింగ్ స్వయంగా కూడా కెరీర్‌లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో, శంకర్-రణవీర్ కలయిక సాధ్యపడేలా కనిపించడం లేదు. ప్రస్తుతం శంకర్.. తమిళ స్టార్ హీరో అజిత్ తో ఒక సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన తమిళ సినీ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు శంకర్ నూతన ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టారు.