దళపతి విజయ్ చివరి చిత్రం రిలీజ్ అప్పుడే !

2026 జనవరి 9 న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా కొత్త లుక్‌తో అభిమానులతో పంచుకున్నారు.;

By :  K R K
Update: 2025-03-24 13:42 GMT

తమిళ దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జన నాయకన్’. 2025 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా.. కొంత కాలం వాయిదా పడిన తర్వాత 2026 జనవరి 9 న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా కొత్త లుక్‌తో అభిమానులతో పంచుకున్నారు. 2024లో ప్రకటించినప్పటి నుంచే ‘జన నాయకన్’పై భారీ అంచనాలు ఉన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రాజకీయ అంశాలను స్పృశిస్తూ, యాక్షన్‌తో మిళితమైన భారీ మాస్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది.

ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ గా అలరించబోతున్నాడు. అలాగే... గౌతం వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్, ప్రియమణి, మమితా బైజు, మోనిష బ్లెస్సీ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేగాక, నెల్సన్ దిలీప్‌కుమార్, లోకేశ్ కనగరాజ్, అట్లీ వంటి దర్శకులు ఈ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్‌ సినీ కెరీర్‌కు ఘనమైన నివాళిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ ఉంది.

‘జన నాయకన్’ టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా రెండు విభిన్న పోస్టర్లు విడుదల చేశారు. అందులో ఒకటి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటసామ్రాట్ ఎం.జీ.ఆర్ గెటప్‌లో విజయ్ కనిపించిన లుక్. ఇది సినిమా రాజకీయ నేపథ్యం వున్నదనే అంచనాలను పెంచింది. విజయ్ త్వరలో పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశముండటంతో, ‘జన నాయకన్’ అతని చివరి సినిమా కావొచ్చని చెబుతున్నారు. దీంతో అభిమానులు ఈ చిత్రాన్ని మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News