పెళ్లిచేసుకోకుండా జీవితాంతం నేనుండగలను : త్రిష
త్రిష కృష్ణన్ మాత్రం 41 ఏళ్ల వయసులోనూ తన సింగిల్ హోదాను గర్వంగా నిర్వహిస్తూ.. తన వివాహంపై కొనసాగుతున్న ఆసక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది.;
వయసు నలభైకి చేరువవుతున్న ప్రతి నటి తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సిందే అన్న నమ్మకాన్ని త్రిష కూల్చేసింది. నయనతార, జెనీలియా, శ్రియా శరణ్, ఇలియానా లాంటి ఆమె సమకాలీన నాయికలు వివాహం చేసుకుని పిల్లలకు జన్మనిచ్చినప్పటికీ, త్రిష కృష్ణన్ మాత్రం 41 ఏళ్ల వయసులోనూ తన సింగిల్ హోదాను గర్వంగా నిర్వహిస్తూ.. తన వివాహంపై కొనసాగుతున్న ఆసక్తిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతోంది.
తాజాగా ‘థగ్ లైఫ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో త్రిషకు మళ్లీ అదే మిలియన్ డాలర్ ప్రశ్న ఎదుర్కొంది. "ఎప్పుడు పెళ్లి?" ఈసారి ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతో నిశ్చలంగా, స్పష్టంగా త్రిష మాట్లాడుతూ.. తనకు వివాహం అనే కాన్సెప్ట్ మీద నమ్మకం లేదని, జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉన్నా తనకేమీ అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఆమె సమాధానాన్ని వినగానే పక్కనే కూర్చున్న కమల్ హాసన్ కూడా కాస్త ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇలా త్రిష మొదటిసారిగా చెబుతున్న విషయం కాదిది. గత ఇంటర్వ్యూలలో కూడా, "నమ్మకమైన వ్యక్తిని కలిస్తే మాత్రమే పెళ్లి గురించి ఆలోచిస్తాను. కానీ కేవలం సమాజపు ఒత్తిడితో పెళ్లి చేసి తరువాత బాధపడటానికి నేను సిద్ధంగా లేను," అని త్రిష స్పష్టంగా చెప్పింది. ఆమెకు ఉన్న ఆ వాస్తవికత, స్పష్టమైన దృక్పథం చాలామంది అభిమానులకు ఎంతగానో నచ్చుతోంది.
ఇదిలా ఉంటే.. మణిరత్నం-కమల్ హాసన్ కలయికలో 38 సంవత్సరాల తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’లో త్రిష ముఖ్యపాత్ర పోషిస్తోంది. సింబు కూడా కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా జూన్ 5న పాన్-ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల కానుంది. వ్యక్తిగత విషయాల్లో స్పష్టతను చూపించిన త్రిష, తన కెరీర్‌లోనూ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ మరోసారి మేటి నటి అని నిరూపించు కుంటోంది.