‘వీర ధీర శూరన్’ విడుదలకు ఢిల్లీ హైకోర్టు బ్రేక్ !

B4U అనే మీడియా సంస్థ.. ‘వీర ధీర సూరన్’ నిర్మాత రియా శిబూకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.;

By :  K R K
Update: 2025-03-27 08:57 GMT

చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘వీర ధీర శూరన్’. ఈ సినిమా విడుదలైన మొదటిరోజే భారీ అడ్డంకులను ఎదుర్కొంది. భారతదేశంతో పాటు అమెరికాలోని ప్రీమియర్ షోలు కూడా రద్దయ్యాయి. దీనికి కారణం ఓటీటీ హక్కులపై చెలరేగిన చట్టపరమైన వివాదం. B4U అనే మీడియా సంస్థ.. ‘వీర ధీర సూరన్’ నిర్మాత రియా శిబూకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ హక్కులను ముందుగా విక్రయించాల్సిన ఒప్పందాన్ని నిర్మాత అమలు చేయలేదని కంపెనీ ఆరోపించింది.

దీంతో, హైకోర్టు తాత్కాలిక స్టే విధించడంతో, ఉదయం 9 గంటలకు ప్లాన్ చేసిన పలు షోలు నిలిపివేయాల్సి వచ్చింది. పీవీఆర్, సినీపోలిస్ వంటి థియేటర్లలో షోలు రద్దయ్యాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. కోర్టు రియా శిబూకు వెంటనే ₹7 కోట్లు జమ చేయాలని, 48 గంటల్లో కేసుకు సంబంధించిన అన్ని కీలక డాక్యుమెంట్లను సమర్పించాలని ఆదేశించింది. అమెరికాలో ప్లాన్ చేసిన ప్రీమియర్ షోలు కూడా ఈ చట్టపరమైన సమస్యల కారణంగా రద్దయ్యాయి.

సినిమా విడుదల ముందు విక్రమ్ విస్తృత ప్రమోషన్లు చేసినా, ఉదయం షోలు రద్దవ్వడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, న్యాయపరమైన అంశాలను పరిష్కరించిన తర్వాత మధ్యాహ్నం లేదా సాయంత్రం నుండి థియేటర్లలో ప్రదర్శనలు మొదలయ్యే అవకాశముందని సమాచారం. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఎస్.జె. సూర్య, సురాజ్ వెంజారమూడ్, దుషారా విజయన్, సిద్ధిక్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 

Tags:    

Similar News