రజనీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ అప్పటినుంచేనా?

Update: 2025-03-07 14:10 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా మాస్ ఎంటర్టైనర్లను లైన్‌లో పెట్టేశారు. అందులో ప్రధానమైనది.. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జైలర్ 2’. మొదటి భాగంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో అలరించిన రజనీకాంత్, ఇప్పుడు మరోసారి అదే పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ‘జైలర్ 2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ చిత్రీకరణ ఈ నెల్లోనే వచ్చే వారం మొదలవుతుందని తెలుస్తోంది.

మొదటి షెడ్యూల్ చెన్నైలో జరుగనుండగా.. అనంతరం చిత్రబృందం గోవా, తమిళనాడులోని తేని ప్రాంతాలకు వెళ్లనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌లు ప్రత్యేక పాత్రల్లో ఇందులోనూ కంటిన్యూ అయ్యే అవకాశముందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమాను కూడా తన లిస్టులో పెట్టుకున్నారు. ఇక ‘జైలర్ 2’ విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీ టీజర్ విడుదలైన వెంటనే విపరీతంగా ట్రెండ్ అయింది. రజనీకాంత్ తన యంగ్ ఎనర్జీ, మాస్ అప్పీల్‌తో ప్రేక్షకులను మరోసారి అబ్బురపరిచారు.

అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే ‘జైలర్ 2’ విడుదల తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రజనీకాంత్ మరోసారి తన మాస్ పవర్ చూపించబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News