మధురై షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ‘పరాశక్తి’
ప్రస్తుతం కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ 25వ చిత్రంగా ‘పరాశక్తి’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న దర్శకురాలు సుధా కొంగర.. తాజాగా చిత్రీకరణలోని ముఖ్యమైన అప్‌డేట్‌ను షేర్ చేశారు. మధురైలో జరిగిన షెడ్యూల్‌ను పూర్తిచేశామని.. ఈ ప్రదేశం తనకు ఎంతో ఇష్టమైనదని పేర్కొంటూ, కాస్టింగ్, టెక్నికల్ క్రూ సభ్యులతో కలిసి తీసిన ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.
గత నెల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను బట్టి.. ఈ చిత్రం ఒకప్పటి మద్రాస్‌లో జరిగిన విద్యార్థి రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని అర్థమ వుతోంది. ఇందులో శ్రీలీల, అధర్వ కీలక పాత్రలు పోషిస్తుండగా.. రవి మోహన్ పాత్ర శివకార్తికేయన్ పాత్రతో పాత కక్షలు పెంచుకున్న వ్యక్తిగా కనిపిస్తోంది. టీజర్‌లో రవి మోహన్ తన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో శివకార్తికేయన్ ఫోటోను టార్గెట్‌గా చేసుకొని తుపాకీతో శిక్షణ పొందుతున్న సన్నివేశం ఆసక్తి రేపుతోంది.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ, సతీష్ సూరియా ఎడిటింగ్ పనులను చేపట్టారు. యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలను సుప్రీం సుందర్ నిర్వహిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇక, శివకార్తికేయన్ మరో ప్రాజెక్ట్ మదరాసిలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, విక్రాంత్, విద్యుత్ జమాల్, షబీర్ కల్లారక్కల్, బిజు మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు