ధనుష్ ‘ఇడ్లీ కడై’ గురించి తాజా అప్డేట్ !
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్ కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. నటనతో పాటు దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకుంటున్న ఆయన, ఇటీవల ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు అతడు తన తదుపరి దర్శకత్వ చిత్రం ‘ఇడ్లీ కడై’ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రం విడుదల తేదీలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
మొదట ‘ఇడ్లీ కడై’ను 2025 ఏప్రిల్ 10న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉందని, 2025 ఆగస్టు లేదా సెప్టెంబర్ మధ్యలో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి. ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని కొన్ని భాగాలు ఇంకా పూర్తికాలేదని, అందువల్ల సినిమా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్, నిత్యామీనన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని సమాచారం.
ప్రస్తుతం ధనుష్ ఆనంద్ యల్ రాయ్ .. దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ చిత్రం ‘తేరే ఇష్క్ మేన్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ కారణంగా ‘ఇడ్లీ కడై’ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయినట్లు సమాచారం. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అలాగే, మరో ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, ధనుష్ తన తదుపరి దర్శకత్వ ప్రాజెక్టును కూడా లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్‌తో కలిసి సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లు కూడా ఊహాగానాలు ఉన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక ధనుష్ తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కుబేరా’ విడుదల తేదీ తాజాగా అనౌన్స్ చేశారు. ఈ మల్టీ-స్టారర్ చిత్రం 2025 జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ కెరీర్‌లో ఈ స్థాయిలో వరుస సినిమాలు ఉండడం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోంది. మరి ‘ఇడ్లీ కడై’ విడుదల తేదీ వాయిదా నిజమేనా? ధనుష్-అజిత్ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ అవుతుంది? అనేది వేచి చూడాల్సిందే!