కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలంటున్నారు
కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకపోతే అతని రాబోయే చిత్రం “థగ్ లైఫ్” ను కర్ణాటక రాష్ట్రంలో నిషేధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.;
కన్నడ భాష తమిళ భాష నుండి ఉద్భవించిందని ఇటీవల కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. కమల్ హాసన్ వ్యాఖ్యలు కన్నడ సాహిత్య సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల నుండి తీవ్రమైన విమర్శలను రేకెత్తించాయి. ఈ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమైనవని, కన్నడ భాష చారిత్రక, సాంస్కృతిక గుర్తింపుకే అవి అవమాన కరంగా ఉన్నాయని వారు ఆరోపించారు. కన్నడ భాషాభిమానులు ఈ వ్యాఖ్యలను తమ భాషా స్వాభిమానానికి దెబ్బతీసే చర్యగా భావిస్తున్నారు.
ఈ వివాదం నేపథ్యంలో.. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. కమల్ హాసన్ తన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని, లేకపోతే అతని రాబోయే చిత్రం “థగ్ లైఫ్” ను కర్ణాటక రాష్ట్రంలో నిషేధించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ చిత్రం, ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతోంది మరియు జూన్ 5, 2025 న విడుదల కానుంది. ఈ చిత్రం కర్ణాటకలో విడుదల కాకుండా నిషేధించాలని కన్నడ సంస్థలు కొన్ని రాజకీయ సమూహాల నుండి బలమైన ఒత్తిడి ఏర్పడుతోంది.
వివాదం తీవ్రతరం కావడంతో, కమల్ హాసన్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలు కన్నడ భాషపై ప్రేమ, గౌరవంతోనే చేసినవని, ఎవరినీ అవమానించే ఉద్దేశ్యం తనకు లేదని ఆయన క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ, ఆయన వివరణ కన్నడ సంస్థలను సమాధానపరచలేకపోయింది. కన్నడ భాషాభిమానులు మరియు సాంస్కృతిక సంస్థలు ఇప్పటికీ తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి మరియు కమల్ హాసన్ నుండి క్షమాపణ కోరుతున్నారు. మరి ఈ వివాదం “థగ్ లైఫ్” చిత్ర విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.