క్షమాపణకు నిరాకరించిన కమల్ హాసన్
తన వ్యాఖ్యలో దురుద్దేశం లేదని... కేవలం అపార్థం జరిగిందని స్పష్టం చేశారు. "దురుద్దేశం ఉన్నప్పుడే క్షమాపణ అవసరం, అపార్థం కోసం కాదు" అని కమల్ హాసన్ లాయర్ కోర్టులో వాదించారు.;
లోకనాయకుడు కమల్ హాసన్ తన "కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది" అనే వ్యాఖ్యకు కన్నడిగలకు క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఆయన తన వ్యాఖ్యలో దురుద్దేశం లేదని... కేవలం అపార్థం జరిగిందని స్పష్టం చేశారు. "దురుద్దేశం ఉన్నప్పుడే క్షమాపణ అవసరం, అపార్థం కోసం కాదు" అని కమల్ హాసన్ లాయర్ కోర్టులో వాదించారు.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే "థగ్ లైఫ్" సినిమాను స్క్రీన్ చేయడానికి అనుమతించదని తేల్చి చెప్పింది. దీంతో, నటుడు-నిర్మాత అయిన కమల్ హాసన్ ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకూడదని నిర్ణయించారు. ఫలితంగా, "థగ్ లైఫ్" సినిమా కర్ణాటకలో తమిళం, కన్నడం లేదా ఏ భాషలోనూ విడుదల కాదు.
మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన "థగ్ లైఫ్" సినిమా వారసత్వం, మోసం, ప్రతీకారం చుట్టూ తిరిగే కథాంశం. ఈ సినిమా జూన్ 5న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇది తన గ్యాంగ్ ద్రోహం చేసి, చంపడానికి ప్రయత్నించిన తర్వాత ప్రతీకారం తీర్చుకునే ఒక డాన్ కథగా రూపొందింది. కమల్ హాసన్ డాన్ పాత్రలో నటిస్తుండగా.. సింబు ఆయన దత్తపుత్రుడిగా కనిపిస్తాడు. త్రిష, అభిరామి మహిళా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.