‘మదరాసి’ తో బౌన్స్ బ్యాక్ అవుతాడా?
"అమరన్" విజయం తర్వాత శివకార్తికేయన్ కెరీర్ మంచి ఊపులో ఉంది. అయితే, మురుగదాస్‌తో ఆయన జతకట్టడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉంది.;
ఒకానొకప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిభావంతులైన దర్శకులలో ఏ.ఆర్. మురుగదాస్ పేరు ముందు వరుసలో ఉండేది. విభిన్నమైన బ్లాక్‌బస్టర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ప్రస్తుతం తన కెరీర్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. మురుగదాస్‌కు ఎదురైన అపజయాల పరంపర "స్పైడర్" చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి.
వరుస పరాజయాల అనంతరం, మురుగదాస్ కొంత విరామం తీసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఆయన తిరిగి తెరపైకి వచ్చాడు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన "సికందర్", శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న "మదరాసి" చిత్రాలతో తన సత్తా చాటుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన "సికందర్" ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. బలహీనమైన కథనమే సినిమా పరాజయానికి ప్రధాన కారణం. కథా కథనంలో లోపాలు, యథావిధి మేకింగ్ కారణంగా సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ అపజయం మురుగదాస్‌పై మరింత ఒత్తిడిని పెంచేసింది.
మరోవైపు, శివకార్తికేయన్ నటిస్తున్న "మదరాసి" చిత్రం మాత్రం మురుగదాస్‌కు ఓ తీపి ఆశగా మారింది. "అమరన్" విజయం తర్వాత శివకార్తికేయన్ కెరీర్ మంచి ఊపులో ఉంది. అయితే, మురుగదాస్‌తో ఆయన జతకట్టడం సరైన నిర్ణయమా? అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఉంది. గత చిత్రాల పరాజయాల నేపథ్యంలో, "మదరాసి" చిత్రం ఎలా ఉండబోతుందో అనే అనుమానాలు అభిమానులను కలవర పెడుతున్నాయి. "మదరాసి" చిత్రం విజయంపైనే మురుగదాస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి మురుగదాస్ మళ్లీ తన సత్తా చాటుకొని.. మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.