చియాన్ విక్రమ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది!
‘వీర ధీర సూరన్: పార్ట్ 2’ ఈ ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.;
చియాన్ విక్రమ్ నటించిన ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’ ఈ ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఒక ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇందులో విక్రమ్ కాళి అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇది ఒక ఫ్యామిలీ మేన్ కమ్ గ్యాంగ్ స్టర్ కథతో తెరకెక్కుతోందని.. ముందు విడుదలైన టీజర్ ద్వారా వెల్లడైంది.
ఇక ఈ మూవీ విడుదల తేదీ పోస్టర్‌లో విక్రమ్ రగ్గడ్ లుక్‌లో కనిపించారు. తన భుజంపై ఆయుధాన్ని మోస్తూ ఉన్న ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. విక్రమ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టర్‌ను పంచుకుంటూ.. “మా డెడ్లీ కాళి మార్చి 27, 2025న థియేటర్లలో మీ ముందుకు రాబోతున్నాడు! ఈ తేదీ గుర్తుంచుకుని చియాన్ విక్రమ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వీర ధీర సూరన్’ చూడటానికి సిద్ధం కండి. ఇది ఎస్.యు. అరుణ్ కుమార్ డైరెక్ట్ చేసిన చిత్రం. జివి ప్రకాశ్ సంగీతం అందించారు. ” అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ డిసెంబర్ 9, 2024న విడుదలైంది. 1 నిమిషం 47 సెకండ్ల నిడివి గల ఈ టీజర్‌లో కాళి (విక్రమ్) ద్వంద్వ పాత్రలతో కనిపించాడు. ఒకవైపు కుటుంబాన్ని ప్రేమించే మనిషిగా, తన భార్య, బిడ్డతో కలసి సరళమైన జీవితం గడుపుతుండగా.. మరోవైపు ఒక గ్యాంగ్‌ను నడిపించే శక్తివంతమైన నాయకుడిగా ఆయన పాత్ర ఆకర్షణీయంగా ఉండబోతోంది. ఈ సినిమా మొదట జనవరి 30న విడుదల కావలసి ఉన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల మార్చి 27కు వాయిదా పడింది. మరి ఈ సినిమా విక్రమ్ కు ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.