ఆ ఊహాగానాల్లో నిజమెంత?
ఈ మధ్య వీరిద్దరూ కలిసి రూపొందించిన ఓ స్పోటిఫై ప్లేలిస్ట్ ఇంటర్నెట్‌లో లీక్ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.;
మల్లూ కుట్టి అనుపమ పరమేశ్వరన్, తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్. ఇద్దరూ ప్రేమలో పడ్డారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మధ్య వీరిద్దరూ కలిసి రూపొందించిన ఓ స్పోటిఫై ప్లేలిస్ట్ ఇంటర్నెట్‌లో లీక్ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అనుపమ, ధ్రువ్ కలిసి రూపొందించిన ‘బ్లూ మూన్’ అనే ప్లేలిస్ట్‌ను ఫ్యాన్స్ గుర్తించి, దానిలోని ప్రొఫైల్ ఫోటోలో ఇద్దరిని పోలిన జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్న దృశ్యం కనిపించడంతో.. వీరి ప్రేమాయణంపై ఊహాగానాలు ఉధృతమయ్యాయి.
ఈ వార్తలు వైరల్ కావడంతో, ఆ ప్లేలిస్ట్‌ను వెంటనే ప్రైవేట్ చేశారు. అయినా, అప్పటికే రెడిట్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై ఆ ప్లేలిస్ట్ స్క్రీన్‌షాట్లు విపరీతంగా షేర్ అయ్యాయి. ఈ ప్లేలిస్ట్‌లో ఎడ్ షీరన్, జస్టిన్ హర్విట్జ్, ర్యాన్ గాస్లింగ్ తదితర ప్రముఖ గాయకుల పాటలు ఉండటం గమనార్హం. వీరి స్పోటిఫై ప్రొఫైల్ మొదట్లో పబ్లిక్‌గా ఉండగా, ప్రస్తుతం ప్రైవేట్‌గా మార్చారు. ఇంతలో అనుపమ పరమేశ్వరన్, ధ్రువ్ విక్రమ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బైసన్’ షూటింగ్ పూర్తయింది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పా. రంజిత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 7న విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ధ్రువ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ చిత్రంలో రజిషా విజయన్, లాల్, ఆమీర్, పశుపతి, అనురాగ్ అరోరా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ‘బిసన్’ చిత్రం ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశముంది. వీరి వ్యక్తిగత సంబంధంపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేకపోయినప్పటికీ.. ప్లేలిస్ట్ ద్వారా బయటపడిన సంకేతాలు మాత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.