అజిత్ ఫ్యాన్స్ అత్యుత్సాహం.. తప్పిన ప్రమాదం
తమిళ స్టార్ అజిత్ అభిమానులు మరింత ముందుకెళ్లారు. ఆయన కొత్త సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం ఏకంగా 285 అడుగుల భారీ కటవుట్ సిద్ధం చేశారు.;
ఇప్పటివరకు సినిమాల కలెక్షన్ల కోసం పోటీ పడే స్టార్ హీరోల అభిమానుల్ని చూశాం. కానీ ఇప్పుడు ఈ పోటీ కటవుట్లకూ పాకింది. అభిమానులు తమ హీరో ప్రతిష్ఠను చాటేందుకు ఎత్తైన కటవుట్లు ఏర్పాటు చేయడం ట్రెండ్ అయ్యింది. ఈ పోటీతోనే తాజాగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన 256 అడుగుల కటవుట్ సంచలనంగా మారింది. ఇది ఇండియాలోనే ఇప్పటిదాకా ఏర్పాటు చేసిన అత్యంత పొడవైన కటవుట్‌గా రికార్డు నెలకొల్పింది.
అంతకు ముందు సలార్ (236 అడుగులు), కెజిఎఫ్ 2 (216), ఎన్జికె (215), విశ్వాసం (185) వంటి సినిమాల కటవుట్లు నిలిచిన గౌరవ స్థానాన్ని 'గేమ్ ఛేంజర్' కట్ అవుట్ దాటి పోయింది. కానీ ఈ ఐడియా మాకెందుకు కలగదు?" అనుకున్నారో ఏమో.. తమిళ స్టార్ అజిత్ అభిమానులు మరింత ముందుకెళ్లారు. ఆయన కొత్త సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ కోసం ఏకంగా 285 అడుగుల భారీ కటవుట్ సిద్ధం చేశారు.
తమిళనాడు తెన్ కాశిలోని ఓ థియేటర్ వద్ద దీన్ని ప్రతిష్టించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మెటల్ ఫెన్సింగ్, గ్రిల్స్ ద్వారా కటవుట్ ని స్టెప్ బై స్టెప్ గా అమర్చుతుండగా, చివరికి అజిత్ తల భాగం కూడా ఏర్పాటు చేశారు. అయితే, కొద్దిసేపటికే అది కూలిపోతున్నట్లుగా భావించిన జనం అప్రమత్తమయ్యారు. వారంతా తక్షణమే ప్రాంగణం నుంచి తప్పుకున్న తర్వాత కట్ అవుట్ పూర్తిగా కూలిపోయింది.
అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ సమయంలో ఎవరూ కటవుట్ మీద లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఇదే తరహాలో 2019లో ‘విశ్వాసం’ రిలీజ్ సందర్భంగా పాలాభిషేకం చేస్తూ అయిదుగురు అభిమానులు కింద పడిపోయి గాయపడిన సంఘటనను ఎవరూ మరిచిపోలేరు. అప్పుడు అజిత్ అభిమానుల క్రియాశీలతపై అసహనం వ్యక్తం చేశారు.
తనకు అసోసియేషన్లు లేవని, తల అనే బిరుదులు పెట్టవద్దని పలు సందర్భాల్లో అజిత్ చెబుతూనే ఉన్నా అభిమానులు ఆ మాటలు పట్టించుకోవడం లేదు. చెక్క లేదా గ్రిల్స్ లాంటి పదార్థాలతో తయారయ్యే కటవుట్లను ఈ స్థాయిలో భారీ ఎత్తుల్లో ఏర్పాటు చేయడం అనారోగ్యకరమే కాదు, ప్రాణాపాయం కూడా. ప్రస్తుతం అజిత్ ఈ సంఘటనపై ఇంకా స్పందించలేదు. కానీ కూలిన కటవుట్ వీడియో చూసిన తర్వాత ఆయన నుంచి గట్టి హెచ్చరిక రావడం ఖాయమన్న టాక్ చెన్నైలో వినిపిస్తోంది.