భారీ బడ్జెట్ తో నయనతార భక్తి చిత్రం !
నయనతార, సుందర్ సి ల రెమ్యునరేషన్లతో పాటు.. చిత్రంలో భారీ స్థాయిలో VFX ఉపయోగించనుండటంతో బడ్జెట్ భారీగా పెరిగింది.;
లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ తమిళ చిత్రం 'మూకుత్తి అమ్మన్' (తెలుగులో 'అమ్మోరు తల్లి'). ఇది ఆస్తికత్వం, దొంగబాబాలపై వ్యంగ్యంగా తెరకెక్కిన భక్తి చిత్రంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా 'మూకుత్తి అమ్మన్ 2' రూపుదిద్దుకుంటోంది. ఈసారి ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ స్థానంలో ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ భారీ భక్తి చిత్రానికి నిర్మాతలు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. ఇటీవల 'అరణ్మనై 4', 'మద గజ రాజా' సినిమాలతో వరుస విజయాలు అందుకున్న సుందర్ సి, ఈ సీక్వెల్ కోసం భారీ పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం. నయనతార, సుందర్ సి ల రెమ్యునరేషన్లతో పాటు.. చిత్రంలో భారీ స్థాయిలో VFX ఉపయోగించనుండటంతో బడ్జెట్ భారీగా పెరిగింది.
ఇంతకు ముందు సుందర్ సి .. రవి మోహన్తో కలిసి ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పటికీ, అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు 'మూకుత్తి అమ్మన్ 2' ద్వారా భారీ బడ్జెట్ చిత్రాలను హ్యాండిల్ చేయగల దర్శకుడిగా తన సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. మొదటి భాగం డైరెక్ట్ ఓటీటీలో విడుదల కాగా.. ఈసారి థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ భక్తి చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, రౌడీ పిక్చర్స్, అవ్ని సినిమాక్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్, బీఫోర్ యూ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.